యూపీలో బీజేపీ విజ‌యం – జ‌గ‌న్‌కు కొత్త టెన్ష‌న్‌

ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఎస్పీ ఓట‌మి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేస్తోంది! ప్ర‌ధాని మోడీ విజ‌యం ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌-ఎస్పీ కూట‌మి ప‌రాభవం జ‌గ‌న్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో త‌న ప‌రిస్థితి ఏంటా అనే గుబులు మొద‌లైంద‌ట‌. అక్క‌డి ఫ‌లితాల‌కీ.. జ‌గ‌న్‌కీ ఉన్న లింక్ ఏంట‌నేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్ర‌శాంత్ కిషోర్‌!! బిహార్ ఎన్నిక‌ల్లో నితీష్‌కుమార్‌కు వ్యూహ‌క‌ర్త‌గా నిలిచిన ప్ర‌శాంత్‌ను.. ఏరికోరి జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌కి కూడా ప్రశాంత్ వ్యూహ‌కర్త అనే విష‌యం తెలిసిందే! ఇప్పుడు యూపీలో ప్రశాంత్ వ్యూహాలు ఏవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్‌లో కొత్త టెన్ష‌న్ మొద‌లైంది.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే…ఆ రాష్ట్రంలో హడావిడి చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ రకంగా వ్యూహం రచించినవాడు ప్రశాంత్ కిషోర్. రైతులందరికీ మంచాలేసి కూర్చోపెట్టి …వేదిక పై నుంచి ఈ దశాబ్ధపు బెస్ట్ కామెడీ పొలిటీషియన్ రాహుల్ గాంధీ చేత గొప్ప గొప్ప మాటలు మాట్లాడించారు. అనంత‌రం మరెన్నో కొత్త కొత్త ఐడియాలను అప్లై చేశాడు. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఘోర ఓటమి మూటకట్టుకుంది కాంగ్రెస్. తాను మునుగుతూ తనతో కలిసిన పాపానికి అశిలేష్ యాదవ్‌ని కూడా ముంచేశాడు రాహుల్. ఈ మునకకు ఒక కారణంగా ప్రశాంత్ కిషోర్ నిలిచాడు.

2014లో మోడీని గెలిపించడం, ఆ తర్వాత బీహార్‌లో నితీష్‌ని గెలిపించడం లాంటి విషయాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్…వెంటనే ప్రశాంత్ కిషోర్‌ని తన ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా నియమించుకున్నాడు. కాస్త భారీగానే ముట్టచెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ కూడా అనుభవం లేని వాడు అని విమర్శిస్తూ ఉండడంతో ప్రశాంత్ కిషోర్ అనుభవం తనకు కలిసొస్తుందని చెప్పి ప్లాన్ చేసినట్టున్నాడు. 2019 ఎన్నికలకు వైసిపి ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే మాత్రం వైసిపి, నాయకులకు, కార్యకర్తలకే ఎన్నికల్లో గెలుపుపైన బోలెడన్ని అనుమానాలు వచ్చే పరిస్థితి.

అదే జరిగితే మాత్రం ప్రశాంత్ కిషోర్ వళ్ళ ఒరిగేదేంటి అంటే చెప్పడం కష్టమే కానీ ఒరిగేది మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. 2019 ఎన్నికలు వైఎస్ జగన్‌కి లైఫ్ అండ్ డెత్ లాంటివి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ని ప్రచార వ్యూహకర్తగా నియమించుకునేంత సాహసం జగన్ చేస్తాడా? ఎవరి మాటా వినడు, తాను ఏం అనుకుంటే అదే చేసుకుంటూ పోతాడు అని జగన్‌పైన గట్టి విమర్శ ఒకటి ఉంది. అలాంటి జగన్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.