ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగింపు పలకనున్న జేసీ బ్రదర్స్

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, సంచ‌ల‌న కామెంట్ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ వారసుల‌ను రంగంలోకి దించే ప‌నిలో నిమ‌గ్న‌మైన వారు.. అందుకు మార్గం సుగ‌మం చేశారు! అనంత‌పురం రాజ‌కీయాల‌ను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వారి స్థానంలో త‌మ త‌న‌యుల‌ను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిల‌బెట్ట‌బోతున్నారు. ఇప్పుడు జేసీ బ్ర‌ద‌ర్స్‌కు స‌రికొత్త అర్థాన్ని ఇవ్వ‌బోతున్నారు.

ఇటీవల ఏపీలో జ‌రిగిన‌ దివాక‌ర్ బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. విప‌క్ష‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య పెద్ద మాట‌ల యుద్ధ‌మే న‌డిచింది. మాట‌ల తీవ్ర‌త హ‌ద్దులు దాటి పోయింది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు జేసీ సోద‌రులు త‌మ వార‌సుల‌కి రాజ‌కీయాల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి వ‌రకూ తెర‌మీద ఉండి రాజ‌కీయాల‌ను న‌డిపిన వీరు.. ఇక తెర వెనుక నుంచి రాజ‌కీయం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ రెడ్డి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా త‌న కొడుకు అస్మిత్ రెడ్డిని తీసుకురాబోతున్నారు.

తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయను అని ప్ర‌భాక‌ర్ రెడ్డి స్ప‌ష్టంచేశాడు. ఇదే ఆఖరి టర్మ్‌ అని అన్నాడు. తాడిపత్రి నుంచి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశాడు ప్రభాకర్‌ రెడ్డి. దశాబ్దాల నుంచే ప్రత్యక్ష పోటీ పట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఉత్సాహం చూపించాడు. అనంతపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌లో తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే అక్కడి నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీలో ఉండటంతో… ప్రభాకర్‌ రెడ్డికి అవకాశం రాలేదు. ఎట్టకేలకు తెలుగుదేశం త‌ర‌ఫున పోటీ చేశారు. మరి అంత ఆరాట పడిన ప్రభాకర్‌ రెడ్డి.. ఒకసారి పోటీతోనే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించడం విశేషం. ఇదంతా వారసుడు అస్మిత్‌ రెడ్డి కోస‌మేన‌ట‌.

ఇప్పటికే దివాకర్‌ రెడ్డి తనయుడు పవన్‌ రెడ్డి రంగంలోకి దిగి హల్‌చల్‌ చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా అతడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన‌ని ఇప్ప‌టికే దివాకర్‌ రెడ్డి ప్రకటించాడు. తద్వారా తనయుడికి లైన్‌ క్లియర్‌ చేశాడు. ప్రభాకర్‌ రెడ్డి కూడా రిటైర్డ్‌ హర్ట్‌ అనే విషయాన్ని ప్రకటించాడు. దీంతో అస్మిత్‌ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు. ఈ విధంగా జేసీ సోదరుల ప్రత్యక్ష రాజకీయ పోరాటం ముగియబోతున్నట్టుగా ఉంది. దశాబ్దాలుగా అనంత, రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌ అంటే.. దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలు చలామణి అయ్యారు. ఇప్పుడు వారి త‌న‌యులు రంగంలోకి దిగ‌బోతున్నారు!!