భూమా వ‌ర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌రణంతో.. ఆయ‌న వ‌ర్గం దిక్క‌లేనిది అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ నంధ్యాల‌లో ప‌రిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియ‌క తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డింది పార్టీ అధిష్ఠానం! ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను పూర్తిగా త‌మ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌రకూ బ‌లంగా ఉన్న భూమా వ‌ర్గాన్ని బల‌హీనం చేసేందుకు వెనుక నుంచి శ‌ర వేగంగా పావులు క‌దుపుతోంది.

నంద్యాల రాజ‌కీయాల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆస‌క్తిక‌రంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఉప ఎన్నికను తెర‌పైకి తీసుకొచ్చింది., ఎమ్మెల్యేగా భూమా గెలిచింది వైకాపా టిక్కెట్ మీదే అయినా మ‌ర‌ణించే స‌మాయానికి త‌మ పార్టీలో ఉన్నారు కాబ‌ట్టి… అది త‌మ స్థాన‌మే అన్న‌ట్టు తెలుగుదేశం ఓన్ చేసేసుకుంది. అంతేకాదు.. ఆ మాట‌ల్ని భూమా కుమార్తె అఖిల ప్రియ‌తో కూడా మాట్లాడిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక గురించి తెలుగుదేశం తెగ ఆరాట పడుతోంది.

ఈ విష‌యంపై మాట్లాడ‌వ‌ద్ద‌ని అఖిల ప్రియ‌కు సూచించిన‌ట్టుగా తెలుస్తోంది. అంతా పార్టీ అభీష్టం మేర‌కే జ‌రుగుతుంద‌ని ఆమె చెబుతున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తుందా రాదా అనే చ‌ర్చ‌పై కూడా ఆమె స్పందించ‌డానికి నిరాక‌రిస్తున్నారు. భూమా మ‌ర‌ణం త‌రువాత అఖిల ప్రియ మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా తెలుగుదేశం పార్టీయే నిర్దేశించింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డు తున్నారు. అందుకే, ఆమెను భూమా మ‌ర‌ణించిన వెంట‌నే ర‌ప్పించు కున్నార‌నీ, ఇక‌పై అంతా తాము చెప్పిన‌ట్టు మాత్ర‌మే మాట్లాడాల‌ని పార్టీ పెద్ద‌లు ఆమెకు హితబోధ చేశార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

అయితే, అండ‌ర్ కరెంట్‌గా భూమా వ‌ర్గాన్ని మ‌రింత బ‌ల‌హీనం చేయ‌డ‌మే తెలుగుదేశం వ్యూహంగా క‌నిపిస్తోంద‌న్న అభిప్రాయ‌మూ వ్య‌క్త‌మౌతోంది. భూమా పార్టీ మార‌క ముందు నుంచీ ఆ వ‌ర్గంపై టీడీపీ ఒత్తిడి ఉంద‌నీ… ఆయ‌న పార్టీ మార‌డానికి కార‌ణాలు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లే కార‌ణం అనే ఆరోప‌ణ ఎటూ ఉంది.

ఇప్పుడు భూమా మ‌ర‌ణంలో ఆ వ‌ర్గం దిక్కులేనిదైపోయింది. వారంతా తెలుగుదేశంపై ఆధారప‌డేలా చేయాలంటే… ముందుగా భూమా వార‌సులు పార్టీపై డిపెండెన్సీ పెంచుకునేలా చేసి త‌ద్వారా ప‌రిస్థితిని త‌మ చెప్పుచేతల్లో పెట్టుకోవాల‌ని చూస్తున్నారు టీడీపీ పెద్ద‌లు.