రుణ‌`మాఫీ`తో ఇద్ద‌రు చంద్రుల‌కు చెక్‌

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయ‌డానికి బీజేపీ అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం రైతుల‌కు `రుణ‌మాఫీ` చేస్తుంద‌ని, ఆభారం కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని చేసిన‌ కేంద్ర‌మంత్రి ప‌క‌ట‌నతో.. ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణ‌మాఫీ నే ప్ర‌చారంగా చేసుకుని అటు చంద్ర‌బాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నిక‌ల్లో ఉప‌యోగించే దిశ‌గా కేంద్రం అడుగులేస్తోంది. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు, కేసీఆర్‌కు రోజురోజుకూ టెన్ష‌న్ పెరుగుతోంది.

భార‌తీయ జ‌న‌తా పార్టీ యూపీలో పాగా వేసిన ద‌గ్గ‌ర నుంచీ ఇద్ద‌రు చంద్రుల‌కూ బెంగ మొద‌లైంది. బీజేపీ త‌రువాతి ల‌క్ష్యం తెలంగాణ అనీ, ఆ త‌రువాత ఏపీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతుంద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ఇద్ద‌రు చంద్రులు.. అందుకు త‌గిన వ్యూహాలు ర‌చిస్తున్నా.. బీజేపీ తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న ముందు ఈ ప‌ప్పులేవీ ఉడికేట్టుగా లేవు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రైతు రుణమాఫీ చేసేందుకు కేంద్రం సిద్ధ‌మౌతున్న‌ట్టు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. యూపీలో ఏర్ప‌డ‌బోయే కొత్త ప్ర‌భుత్వం, రైతుల రుణాల‌ను మాఫీ చేస్తుంద‌నీ.. ఆ ఆర్థిక భారాన్ని కేంద్రం భ‌రిస్తుంద‌ని మంత్రి రాధామోహన్ సింగ్ ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ దుమారం రేగుతోంది.

త‌మ ప‌రిస్థితి ఏంటంటూ.. అన్ని రాష్ట్రాలూ కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. అయితే, ఈ హామీ ద్వారా తెరాస‌, టీడీపీల‌కు కొత్త‌గా మొద‌లైన టెన్ష‌న్ వేరే ఉంది! వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆంధ్రా, తెలంగాణ‌లో ఇదే హామీతో భాజ‌పా సోలోగా రంగంలో దిగే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ముందుగా యూపీలో ఈ హామీని అమ‌లు చేసి… త‌రువాత‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇత‌ర రాష్ట్రాల్లో కూడా ఇదే హామీ ఇస్తే… ఆ ప్ర‌భావం తెరాస‌, తెలుగుదేశంపై తీవ్రంగా ప‌డొచ్చు. ఎందుకంటే, గ‌త ఎన్నిక‌ల్లో ఈ హామీతోనే చంద్ర‌బాబు, కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చారు. దీని అమ‌లులో ఇద్ద‌రు చంద్రులూ త‌డ‌బ‌డ్డార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పూర్తిస్థాయిలో రుణ‌మాఫీ చేయ‌లేని ప‌రిస్థితి ఇరు రాష్ట్రాల్లో నెలకొంది.

దీంతో చాలామంది రైతుల్లో ఎలాగూ ఈ అసంతృప్తి ఉండ‌నే ఉంది. ఇదే హామీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పా రంగంలోకి దిగితే త‌మ‌కు ఇబ్బందే అనేది తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కొత్త‌గా మొద‌లైన టెన్ష‌న్‌. ఒక‌వేళ‌.. ఇప్పుడు యూపీతోపాటు త‌మ‌కూ రుణమాఫీకి సాయం చేయండ‌ని కోరినా కూడా స‌మ‌స్యే..! ఎందుకంటే, ఇంత‌వ‌ర‌కూ రుణ‌మాఫీ చేయ‌డంతో తామే గొప్ప అంటూ తెరాస‌, టీడీపీ చాటుకుంది. ఇప్పుడు కేంద్ర సాయం కోరితే, ఒక‌వేళ కేంద్రం సానుకూలంగా స్పందిస్తే… ఆ క్రెడిట్ మొత్తం భాజ‌పా అకౌంట్లోకి షిప్ట్ అయిపోవ‌డం ఖాయం!