చంద్ర‌బాబు నో రిస్క్‌ … కొడుకు భ‌విష్య‌త్తు కోమే

ఎలాంటి క‌ఠిన‌ ప‌రిస్థితులైనా ఎదుర్కొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కొద్దిగా వెన‌క్కి తగ్గారు! ఎన్నిక‌లంటే భ‌యం లేదు.. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను అని చెప్పిన ఆయ‌న‌.. తొలిసారి కొద్దిగా భ‌య‌ప‌డ్డారు! అది కూడా త‌నయుడి కోసం రిస్క్ తీసుకునేందుకు కొద్దిగా ఆలోచించారు! మొత్తానికి ఆరో అభ్య‌ర్థిని పోటీలో నిల‌బెట్ట‌కుండానే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌రిలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన జాబితా విడుద‌లైంది. దీంతో మొత్తం ఏడు స్థానాల‌కు ఐదింటిని టీడీపీ సునాయాసంగా ద‌క్కించుకోనుంది. ఇక వైసీపీ మాత్రం రెండో స్థానం కోసం కొద్దిగా క‌ష్ట‌పడాల్సిందే!!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. నారా లోకేశ్(చిత్తూరు)‌, బచ్చుల అర్జునుడు(కృష్ణా జిల్లా), కరణం బలరాం( ప్రకాశం జిల్లా), పోతుల సునీత(ప్రకాశం జిల్లా), డొక్కా మాణిక్యవరప్రసాద్‌(గుంటూరు), సోమవారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ సోమవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీలో ఉదయం 10.39 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ సీట్ల‌లో..  ఒక్కో సీటుకు 25 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ లెక్కన అధికార టీడీపీకి ఐదు, విపక్ష వైసీపీకి ఒక‌టి ఖాయంగా దక్కనున్నాయి. మిగిలిన మరో స్థానానికి సంబంధించి ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేరు. అయితే ఈ స్థానాన్ని దక్కించుకునే విషయంలో టీడీపీ కంటే కూడా వైసీపీకే అధికంగా అవకాశాలున్నాయి. ఈ స్థానానికి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు వైసీపీకి కూడా లేనప్పటికీ… మరో నాలుగైదు ఓట్లను ఎలాగొలా పోగేసుకుంటే ఆ పార్టీ ఈ సీటును ఈజీగా గెలుస్తుంది. అదే టీడీపీ విషయానికి వస్తే.. ఈ సీటు దక్కించుకోవాలంటే ఆ పార్టీకి ఏకంగా 20కి పైగా ఓట్లు అవసరం కానున్నాయి.
ఇప్ప‌టికే ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు మ‌రో 20మందిని త‌మ వైపు లాక్కుంటే ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షం విరుచుకుప‌డే అవ‌కాశముంది. అలాగే తన కుమారుడు లోకేశ్ ను మండలికి పంపనున్న త‌రుణంలో గుడ్డిగా ముందుకెళ్లి… అపజయం పాలవడం లోకేశ్ కెరీర్కు అంత మంచిది కాదన్న దిశగానూ ఆలోచించిన చంద్రబాబు ఆరో సీటు కోసం బరిలోకి దిగొద్దని భావించినట్లు సమాచారం. ఎన్నికలు జరిగేలా వ్యవహరించి ఓడిపోవడం కంటే కూడా.. మిన్నకుండిపోవడమే మేల‌ని భావించి చంద్ర‌బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.మొత్తానికి  ఒకడుగు వెన‌క్కి వేసినా చంద్ర‌బాబు.. కొడుకు భ‌విష్య‌త్తు కోమే అనేది తెలుస్తోంది.