బీజేపీ లో ఉండలేక..వెళ్లేలేక..సీనియర్ కష్టాలు

క‌క్క‌లేక మింగ‌లేక అన్న చందంగా త‌యారైంది  బీజేపీ నేత నాగం జ‌నార్ద‌నరెడ్డి పరిస్థితి. తెలుగుదేశం హ‌యాంలో పార్టీలో టాప్‌-3లో ఉన్న ఆయ‌న.. బీజేపీలో చేరిన త‌ర్వాత వంద‌లో 98వ వ్య‌క్తిలా అయిపోయారు! టీడీపీలో ఉండ‌గా.. జిల్లా రాజ‌కీయాల‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చ‌క్రం తిప్పిన ఆయ‌న‌.. ఇప్పుడు కనీసం జిల్లా రాజ‌కీయాల్లోనూ ప‌ర‌ప‌తి లేని నాయ‌కుడిగా మారిపోయారు!! పార్టీ మారిన త‌ర్వాత త‌న ప‌రిస్థితి పూర్తిగా `త‌ల‌కిందులు` అయిపోయింద‌ని తెగ బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఇక బీజేపీని విడిచి పోదామంటే.. బ‌ద్ధ శ‌త్రువైన టీఆర్ఎస్ మిన‌హా ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో ఇప్పుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ట‌.

నాగం జ‌నార్థ‌న్ రెడ్డికి పార్టీ మారిన త‌ర్వాత ఏదీ క‌లిసి రావ‌డం లేదు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక‌ల్లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా బీజేపీలో స‌ముచిత ప్రాధాన్యం ల‌భిస్తుంద‌ని ఆశించారు. చివ‌రికి నిరాశే మిగిలింది. బీజేపీ అధిష్టానం జాతీయ కార్య‌వ‌ర్గంలో స్థానం క‌ల్పించి స‌రిపెట్టింది. నిజానికి బీజేపీలో చేరిన త‌ర్వాత అన్నీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కే జ‌ర‌గాలి. చివ‌ర‌కు ప్రెస్ మీట్ పెట్టాల‌న్నా అంతే!! రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించిన ఆయ‌న ఇప్పుడు కేవలం ఒక జిల్లాకే ప‌రిమిత‌మైపోయారు.

దీంతో నాగం బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు.. ఆయ‌నకు ప‌డ‌డం లేద‌ని టాక్. ఆ మ‌ధ్య ఆయ‌న `తెలంగాణ బ‌చావో` అంటూ వేదిక‌ను కూడా మొద‌లుపెట్టారు. చివ‌ర‌కు దాన్ని వ‌దిలేశారు. ఇప్పుడు ఆయ‌న నిర్ణ‌యం తీసుకోలేని సందిగ్థ స్థితిలో ప‌డిపోయార‌ట‌. ఒక‌వేళ సొంత గూటికి వెళ‌దామంటే.. త‌న క‌న్నా జూనియ‌ర్ అయిన రేవంత్‌రెడ్డి కింద ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది క‌నుక‌.. ఆయ‌న వెళ్లినా ఇక నిష్ప్ర‌యోజ‌న‌మే!

బీజేపీలో ఉందామంటే పొమ్మ‌న‌క పొగబెట్టుతున్నార‌ని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ లోకి వెళ్లలేరు. ఇక మిగిలింది టీఆర్ఎస్ మాత్ర‌మే. ఆ పార్టీ నుంచి ఎన్నిక‌ల ముందే ఆఫ‌ర్ వ‌చ్చింది. వెళ్లుంటే..ఏకంగా మంత్రిప‌ద‌వే ద‌క్కింది. ఇప్పుడు కారెక్కినా అంత‌గా ప్రాధాన్యం ఉండ‌క‌పోవ‌చ్చు. దీంతో కొన్నాళ్ల పాటు లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. 2019 ఎన్నిక‌ల ముందు త‌దుప‌రి కార్యాచ‌ర‌ణపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని అనుకుంటున్నారట‌.