ఏపీ బీజేపీ నేత‌ల దూకుడుకు బాబు క‌ళ్లెం

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. ఏపీ రాజ‌కీయ చిత్రంలో అనేక మార్పులు జ‌రిగే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఎవ‌రు ఎవ‌రికి మిత్రులు అవుతారో.. మరెవ‌రు శ‌త్రువుల‌వుతారో కొద్ది రోజుల్లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విష‌యంలో టీడీపీ నాయ‌కులు, టీడీపీతో వ్య‌వ‌హ‌రించే విష‌యంలో బీజేపీ నాయ‌కుల్లోనూ కొంత మార్పు వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. విస్త‌ర‌ణ‌కు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని పార్టీ పెద్ద‌ల‌కు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో వారికి బ్రేక్ వేస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు!! మ‌రి ఇప్ప‌టికైనా ఈ ముసుగులో గుద్దులాట బ‌య‌ట‌ప‌డుతుందో లేదో!!

విడిపోయి బ‌ల‌ప‌డ‌దామ‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు చెబుతుంటే.. క‌లిసుంటే క‌ల‌దు సుఖం అని ఏపీ సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు! పార్టీని విస్త‌రించాల‌ని బీజేపీ నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతుంటే.. బీజేపీ విస్త‌రిస్తే ఇక టీడీపీకి న‌ష్ట‌మ‌ని బాబు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఆంధ్రాలో మాత్రం బాగానే ఉంటుంద‌ని చెప్పుకోవాలి. ఈ గెలుపుతో ఆంధ్రాలోని భాజ‌పా నేత‌లు బ‌లం పుంజుకున్నారు. పార్టీని విస్త‌రించ‌డానికి మిత్ర ధ‌ర్మం అడ్డుగా ఉంద‌ని, సొంతంగా ఎద‌గ‌లేక‌పోవ‌డానికి కార‌ణం కూడా ఇదే అని మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం. అందుకే విడిపోతే న‌ష్ట‌మ‌ని తెలిసే క‌య్యం కంటే నెయ్య‌మే ముద్దు అంటున్నారు చంద్ర‌బాబు!!

యూపీ ఎన్నిక‌ల త‌ర్వాత తెలుగుదేశం పార్టీని డీల్ చేసే విధానంలో కాస్త మార్పు వ‌చ్చిన‌ట్టుగా అనిపిస్తోంది! ఇదే త‌రుణంలో ఓటుకు నోటుకు కేసు వంటి కీల‌కాంశాలపై కేంద్రం నివేదిక‌లు తెప్పించుకోవ‌డం కూడా ఇక్క‌డ గ‌మ‌నార్హ మే. ఇక‌, ఏపీ భాజ‌పాలో చంద్ర‌బాబు అనుకూల నాయ‌కులు ఉన్న సంగ‌తి తెలిసిందే. వారి విష‌యంలోఇక‌ జాగ్ర‌త్త‌ప‌డే అవ‌కాశాలున్నాయి. బాబు చేష్ఠ‌ల‌కు విసిగిపోయిన భాజ‌పా నేత‌ల వాయిస్ పెరిగే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. అయితే, ఇవ‌న్నీ ముందే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు.. భాజ‌పాతో మ‌రింత స్నేహాన్ని పెంచుకోవ‌డం ద్వారా… ఏపీలో భాజ‌పా విస్త‌ర‌ణ‌కు బ్రేకు వెయ్యొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.

ఇంకోప‌క్క, తెలంగాణ‌లో భాజ‌పాకు బ‌లం పెంచాల‌ని అమిత్ షా వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు క‌థనాలు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో ఏపీ సంగ‌తేంట‌నేది కూడా భాజ‌పా నేత‌లు ఆలోచిస్తున్నారు. దేశంలో ఏ ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌పైనా ఆధార‌ప‌డ‌కూడ‌ద‌న్న‌ది భాజ‌పా లాంగ్ టెర్మ్ విజ‌న్. మ‌రి, ఏపీ విష‌యంలో ఎలాంటి వ్యూహంతో భాజ‌పా ఉంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే త‌రుణంలో స్నేహాన్ని మ‌రింత పెంచుకోవ‌డం ద్వారా త‌మ ప‌ట్టును కొన‌సాగించు కునేందుకు చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వ్యూహం కూడా ఆస‌క్తికరంగా మారుతోంది.