ఏకులా వ‌చ్చిన మేకులా మారిన కొమ్మినేని

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అత్యుత్సాహం ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మేకుగా మారింది. త‌న‌ను న‌మ్మి కీల‌క‌మైన స్థానంలో కూర్చోబెడితే ఇప్పుడు జ‌గ‌న్‌నే ఇబ్బందుల్లోకి నెట్టేశారు కొమ్మినేని! అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ..కోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన కౌంట‌ర్ ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జ‌గ‌న్‌కు చెందిన చాన‌ల్‌లో కొమ్మినేని చేసిన ఇంట‌ర్వ్యూ వ‌ల్ల జ‌గ‌న్ చిక్కుల్లో ప‌డ్డారు. జ‌గ‌న్‌ను మంచి వ్య‌క్తిగా చూపించాలనే అత్యుత్సాహం.. జ‌గ‌న్‌ను మ‌రోసారి జైలు ఊస‌లు లెక్క‌పెట్టిచే వ‌రకూ తీసుకెళ్లింది.

ప్రభుభక్తి చాటుకోవాలన్న ఆదుర్తాతో సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన ఇంటర్వ్యూలు ఇప్పుడు జగన్‌ను ఇరుకున పెడుతున్నాయి. ఎన్టీవీ నుంచి అవమానకరమైన రీతిలో బయటకు వచ్చిన కొమ్మినేనిని సాక్షి నెత్తిమీద పెట్టుకుంది. కొమ్మినేని వంటి జర్నలిస్టు జగన్ చెంత‌న ఉంటే ఇక రాబోయే ఎన్నికల్లో దున్నెయ‌టం ఖాయమని వారంతా భావించారు. పొలిటీషియన్లను , సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారిని ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఆయన చేసిన ఇంటర్వ్యూలు బెడిసి కొట్టి జగన్‌ మెడకు చుట్టుకోబోతున్నాయి. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేయడంతో జగన్‌ టీం అవాక్కైంది.

కొమ్మినేని నిర్వహించిన షోలో జగన్‌పై ఉన్న కేసులను ప్రస్తావించి… అవి అసలు నిరూపణ కావని, కేవలం రాజకీయకక్షలతో పెట్టారని ఇంటర్వ్యూ కొచ్చిన ప్రతివారితో చెప్పించారు. దీంతో సీబీఐ జగన్‌ ఇప్పుడు బయట ఉంటే కేసులో సాక్షాలు మాయం చేస్తారని, ఆయనను వెంటనే అరెస్టు చేసి మళ్లీ జైలుకు పంపాలని కోర్టులో పిటీషన్‌ వేసింది. దీంతో ఇప్పుడు ‘జగన్‌’ శిబిరంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కొమ్మినేని వల్లే ఇదంతా జరిగిందని వైకాపా నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

కోర్టు విచారణలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదనే సంగతి తెలిసి కూడా వారితో ఆ కేసులు నిలబడవు…! అవన్నీ రాజకీయ కోణంలో పెట్టిన కేసులు…దానికి సాక్ష్యాలు లేవు..జగన్ శుద్ధ‌పూస, టిడిపి,కాంగ్రెస్‌ నాయకులు కుట్రతో కేసుల్లో ఇరికించారు…అంటూ కేసును ప్రభావితం చేసే విధంగా సమాధానాలు చెప్పించారు. కొమ్మినేని అత్యుత్సాహమే ఇప్పుడు సీబీఐ పిటీషన్‌కు కారణమని వైకాపా అభిమానులు, కార్యకర్తలు విమ‌ర్శిస్తున్నారు. తమకు ప్లస్‌ అవుతాడని భావించిన కొమ్మినేని చివరకు జగన్‌కు శిరోభారంగా మారాడని ఎద్దేవా చేస్తున్నారు.