కేసీఆర్ `ముంద‌స్తు` వెనుక అస‌లు కార‌ణ‌మిదే

ముందస్తు ఎన్నిక‌లు.. ఇప్పుడు తెలంగాణ‌లో జోరుగా వినిపిస్తున్న మాట‌. వ్యూహాల్లో ఎవ‌రికీ అందకుండా ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే సీఎం కేసీఆర్‌.. ముందస్తు ఎన్నిక ల‌గురించి ఎందుకు ఆలోచిస్తున్న‌ట్లు? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆయ‌న ఎన్నికల గురించి నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర మైన అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ట‌. అందుకే వీలైనంత తొంద‌ర‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించి మ‌ళ్లీ అధికారిన్ని చేజిక్కించుకోవాల‌ని వ్యూహాత్మ‌కంగా ఈ ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహానికి తెర‌తీశార‌ట‌.

తెలంగాణలో ప్ర‌తిప‌క్షం బ‌ల‌ప‌డుతోంది. అవ‌కాశం వ‌స్తే విజృంభించాల‌ని ఎవ‌రికి వారు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. 2018లోనే ఎన్నిక‌లు అని వినిపిస్తున్న నేపథ్యంలో రాజ‌కీయ పార్టీలు త‌మ శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేసుకుంటున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల‌లో తిరుగుతూ పార్టీ శ్రేణుల‌ను ఒక తాటి మీద‌కు తీసుకురావాల‌ని పార్టీలు పిలుపునిస్తున్నాయి. 2018 ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళికా బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నాయ‌కుల‌కు సూచిస్తున్నార‌ట‌. ఈ ప‌రిస్థితి ఎందుకొచ్చిందో ప‌రిశీలిస్తే..

తెలంగాణ ఏర్ప‌డి టీ ఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేసీఆర్ వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హంచ‌డంతో టీడీపీ, కాంగ్రెస్ నామ‌మాత్రంగా త‌యార‌య్యాయి. ఇక ఇటీవ‌లె కేసీఆర్ త‌న సొంత స‌ర్వే చేయించుకున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఫ‌లితం వ‌చ్చింది. అయితే గ‌తంలో క‌న్నా సీట్లు కొన్ని కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని స‌ర్వేలు తెల్చి చెప్పాయి. ఈ విష‌యం పార్టీకి మింగుడు ప‌డ‌టం లేదు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే 2019 పార్టీకి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ స‌ల‌హాదారులు సీఎంకు చెప్పార‌ట‌.

దీంతో సుదీర్ఘంగా ఆలోచించిన కేసీఆర్.. గెల‌వాలంటే 2018లోనే ఎన్నిక‌ల‌కు వెళితే బాగుంటుంద‌నే భావ‌న‌కు వ‌చ్చార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లంగా లేక‌పోవ‌డంతో దాన్ని అనుకూలంగా మార్చుకుంటే ఫ‌లితాలు మెరుగ్గా రావ‌చ్చ‌ని సీఎం భావిస్తున్నారు. ఈ వ్యూహంతో ప్ర‌త్య‌ర్థి పార్టీలు పుంజుకోకుండా నిరోధించ‌వ‌చ్చ‌ని ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కానీ కేసీఆర్ మ‌న‌సు లో మాట‌ను టీడీపీ ప‌సిగ‌ట్టిన‌ట్టుంది. అందుకే 2018 లోనే ఎన్నిక‌లంటూ హాడావుడి చేస్తోంది. మరి కేసీఆర్ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో!!