ఊస్టింగ్ మంత్రుల‌తో బాబుకు బెదిరింపులా..!

గ‌త యేడాదిన్న‌ర‌గా చ‌ర్చ‌ల్లో ఉన్న ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 2వ తేదీ ఉద‌యం 9.25 గంట‌ల‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న వార్త‌ల‌తో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. మంత్రివ‌ర్గంలో ఇన్‌-అవుట్ అంటూ వ‌స్తోన్న వార్త‌ల‌తో కొంద‌రు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మంత్రివ‌ర్గం నుంచి త‌మ‌ను త‌ప్పిస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో కొంద‌రు మంత్రులు త‌మ‌ను త‌ప్పిస్తే పార్టీకి గుడ్ బై చెపుతామ‌ని త‌మ అనుచ‌రుల ద్వారా చంద్ర‌బాబుకు మెసేజ్ పంపిన‌ట్టు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం తాను అనుకున్న‌ది చేసేందుకే డిసైడ్ అయ్యార‌ని కూడా తెలుస్తోంది.

బాబుకు బెదిరింపులు పంపిన వారిలో కోస్తా జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల‌కు చెందిన మ‌రో సీనియ‌ర్ మంత్రి ఉన్న‌ట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్‌బాబు వ‌రుస‌గా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయారు. ఈ మంత్రి మెడ‌పైనే అంద‌రిక‌న్నా ముందుగా వేటు క‌త్తి వేలాడుతోన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ద‌ళిత వ‌ర్గానికి చెందిన రావెల‌ను త‌ప్పిస్తే ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంతో పాటు పార్టీపై వ్య‌తిరేక సంకేతాలు వెళ‌తాయ‌న్న ఆలోచ‌న‌తో ఉన్న చంద్ర‌బాబు గుంటూరు జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రుల‌ను త‌ప్పించి వీరి స్థానంలో మ‌రో ఇద్ద‌రికి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జివి.ఆంజ‌నేయుల‌తో పాటు వేమూరు ఎమ్మెల్యే న‌క్కా ఆనంద్‌బాబుకు చోటు క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. ఇక రాయ‌ల‌సీమ‌కు చెందిన సీనియ‌ర్ మంత్రి కెఈ.కృష్ణ‌మూర్తిని త‌ప్పిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌నకు చంద్ర‌బాబుకు ఇటీవ‌ల అస్స‌లు పొస‌గ‌డం లేదు. కేఈని మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తే ఆయ‌న కూడా పార్టీకి గుడ్ బై చెపుతాన‌ని ఆయ‌న స‌న్నిహితుల‌కు ఇప్ప‌టికే చెప్పార‌ట‌.ఇదే అంశాన్ని ఆయ‌న చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పిస్తే పార్టీనే వీడుతామంటూ మంత్రులు చంద్ర‌బాబుకే హెచ్చ‌రిక‌లు పంపుతోన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారా అన్న‌ది కూడా ఉత్కంఠ‌గానే మారింది. ఇక కొత్త మంత్రుల‌కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులకు ఇచ్చినట్లు సమాచారం.