సోమిరెడ్డి మంత్రి ప‌ద‌వికి బ్రేక్ వేస్తోందెవ‌రు..!

మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో నెల్లూరు జిల్లాలో మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నేది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఎప్ప‌టి నుంచో వేయిక‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు. మంత్రి అయ్యేందుకు సోమిరెడ్డి త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌రో వైపు బీసీ కోటాలో ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌యాద‌వ్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

నెల్లూరు జిల్లాలో రెడ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్న చ‌ర్చ‌లు ముమ్మ‌రంగా సాగుతుండ‌డంతో సోమిరెడ్డి నిన్న‌టి వ‌ర‌కు రేసులో కాస్త ముందు ఉన్నారు. ప్ర‌స్తుతం జిల్ల నుంచి మంత్రిగా ఉన్న పొంగూరు నారాయ‌ణ ఇటు పార్టీలోను, అటు ప్ర‌భుత్వంలోను ప‌ట్టు సాధించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించేందుకు, జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కుడు అవ‌స‌రం ఉంద‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోన్న మాట‌.

ఈ క్ర‌మంలోనే సోమిరెడ్డి పేరు ముందుంది. అయితే సోమిరెడ్డి మంత్రి అయితే త‌న‌కు ఎక్క‌డ ప్రాధాన్య‌త త‌గ్గుతుందోన‌ని భావిస్తోన్న మంత్రి నారాయ‌ణ బీసీ కోటాలో బీద‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చి…సోమిరెడ్డిని మండ‌లి చైర్మ‌న్ చేయాల‌ని చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఇటు నారాయ‌ణ మ‌ద్ద‌తుతో బీద జిల్లాలో బీసీల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్‌ను గ‌ట్టిగా వినిపిస్తున్నారు.

ఇక సోమిరెడ్డి 2004-2009-2012-2014 ఇలా వ‌రుస‌గా నాలుగు ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఆయ‌న్ను మండ‌లి చైర్మ‌న్ చేసి బీద‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని నారాయ‌ణ చంద్ర‌బాబుకు లెక్క‌లు చెపుతున్నార‌ట‌. ఈ విష‌యం బయ‌ట‌కు రావ‌డంతో జిల్లా టీడీపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. సోమిరెడ్డి వర్గీయులు మాత్రం తమ నాయకుడికి ప దవి రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు. మ‌రి ఫైన‌ల్‌గా బాబు కేబినెట్‌లో ఎవ‌రికి ప్లేస్ ఉంటుందో చూడాలి.