ఇరు రాష్ట్రాల చంద్రుల‌కు హ్యాప్పీ న్యూస్

జంప్ జిలానీల‌కు సీట్లు ఎలా స‌ర్దుబాటు చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ హామీతో ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు చేరిపోయారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఇక రెండు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేగ‌డం ఖాయం! అయితే ఇప్పుడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపున‌కు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం స‌మాచారాన్ని పంపాల‌ని ఇరు రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశాలు పంపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ప్ర‌ధాని మోడీ.. కొండంత భ‌రోసా ఇచ్చిన‌ట్ట‌యింది.

`ఆపరేషన్ ఆకర్ష్` పేరుతో రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు `జంపింగ్` రాజకీయాల్ని ఏ స్థాయిలో ప్రోత్సహించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వీరికి ప్ర‌ధాని మోడీ బాస‌ట‌గా నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం ప్ర‌తిసారీ వార్త‌ల్లో నిలుస్తోంది. కానీ ఈ విషయంపై ఇచ్చిన హామీతో సీట్ల పెంపు పెద్ద కష్టమైన అంశం కాదు. కానీ నిన్నమొన్నటి వరకూ సీట్ల పెంపుపై కేంద్రం అంత సుముఖంగా లేదన్న మాట వినిపించింది. ఇప్పుడ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చినట్టు క‌నిపిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటిని 225కు, తెలంగాణలో ఉన్న119 స్థానాల్ని 153 స్థానాలకు పెంచేందుకు వీలుగా.. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనువుగా.. భౌగోళిక.. ఇతర సంబంధిత గణాంకాలు.. పాలనా యూనిట్లలో మార్పులు.. చేర్పులతో కూడిన ఆడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ను పంపాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఉభయ రాష్ట్రాలకు సమాచారం అందింది. దీంతో.. అసెంబ్లీ సీట్ల పెంపుఅంశంపై చర్చ మళ్లీ మొదలైంది.

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో.. సీట్ల పెంపు అంశంపై ప్రత్యేక దృష్టి పెడితే తప్పించి పూర్తి కాని పరిస్థితి ఏర్ప‌డింది.

కేంద్రం కోరిన సమాచారాన్ని రెండు రాష్ట్రాలు పంపిన తర్వాత ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంత అషామాషీ వ్యవహారం ఎంతమాత్రం కాదని.. దానికి చాలానే లెక్కలు ఉన్నాయని.. నియోజకవర్గాల సరిహద్దులు సిద్ధం చేయటం.. అందుకు కేంద్రం ఓకే అనటానికి మద్యనే కసరత్తు ఉందని.. ప్రతి దశలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శిస్తే తప్పించి.. 2019 ఎన్నికల నాటికి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్ధం కావని చెబుతున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై కేంద్రంలో క‌ద‌లిక రావ‌డం ఇరు రాష్ట్రాల చంద్రుల‌కు హ్యాప్పీ న్యూసే కావొచ్చు!