నెల్లూరు టీడీపీలో క్యాస్ట్ ఫీలింగ్‌ చిచ్చు

నెల్లూరు జిల్లాలో వ‌ర్గ‌పోరు ముదిరిపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు కుల స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌లు టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఇత‌ర సామాజిక‌వ‌ర్గాల ఆధిప‌త్యాన్ని స‌హించ‌లేని రెడ్డి సామాజిక నేత‌లు.. జ‌గ‌న్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే మంత్రి నారాయ‌ణ‌, బీద ర‌విచంద్ర‌లు.. త‌మను అణ‌గ‌దొక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. అయితే ఆల‌స్యంగా విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు.. ఆ ఇద్ద‌రు నేత‌ల‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక్క‌డ అభ్య‌ర్థి విజ‌యం ఖాయ‌మ‌ని ధీమాగా ఉన్న స‌మ‌యంలో ఈ లుక‌లుక‌లు బాబును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయ‌ట.

నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు జగన్‌ పార్టీలో చేరిపోవడంతో సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారట‌. జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ‌ను పిలిపించుకుని.. ఈ విష‌యంపై చ‌ర్చించార‌ట‌. పార్టీ అధికారంలో ఉండ‌గా.. నాయ‌కులు ప్ర‌తిప‌క్షంలో చేర‌డ‌మేంట‌ని తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేశార‌ట‌. అయితే పార్టీలోని రెడ్డి సామాజిక నేత‌లు ఎందుకు పార్టీ మారుతున్నారో జిల్లా నాయ‌కుల‌ను అడిగి ఆరా తీయ‌గా.. షాకింగ్ విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయ‌ట‌. జిల్లాలో రెడ్డి సామాజికవర్గ నేత‌లు వారు అధిక సంఖ్యలో ఉన్నా… వారికి మంత్రి పదవి ఇవ్వకపోవడం వ‌ల్లే వీరంతా పార్టీ వీడుతున్నార‌ని చంద్ర‌బాబుకు నాయ‌కులు వివ‌రించార‌ట‌.

బలిజ వర్గానికి చెందిన నారాయణ, బీసీ వర్గానికి చెందిన బీద రవిచంద్రలు జిల్లాపై పెత్తనం చేయడం ఏమిట‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నార‌ని, అందుకే పక్క పార్టీలో చేరుతున్నార‌ని వివ‌రించార‌ట‌. వాకాటి నారాయణరెడ్డి బ‌దులు ఆదాల‌ను బ‌రిలోకి దింపితే పార్టీ ఓటర్లలో కూడా చీలిక వచ్చి అవలీలగా విజయం సాధించేవారని, కానీ ఆయనను రానీయకుండా మంత్రి నారాయణ, పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర, ఆనం సోదరులు తెరవెనుక కుట్ర పన్నార‌ని… అందుకే పార్టీ అభ్యర్థికి ఇన్ని కష్టాలు అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అలాగే మంత్రి పదవి ఆశించిన సోమిరెడ్డికి కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తానని చంద్రబాబు సూచనాప్రాయంగా చెప్పడంతో ఆ పోస్టుపై ఆసక్తి కనపరచడం లేదు.

ఆదాలకు పోటీ చేసే అవకాశం ఇస్తే ఆయన విజయం తప్పక సాధిస్తారని ఆ తరువాత మంత్రి అవుతారనే భయాందోళనతో పలువురు నాయకులు వాకాటికి మద్దతు ఇచ్చి పార్టీని బజారున పెట్టారని వివ‌రించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నేతలందరితో ప్రత్యేకంగా సమావేశమై టీడీపీ ఓటర్లను చేజారకుండా పథకం రూపొందించుకుండా ఉంటే అసలకే మోసం వస్తుందని సీనియర్‌ నాయకులు సూచిస్తున్నారు. చేజారిన ఓటర్లను తిరిగి రప్పించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చంద్రబాబు, లోకేష్‌ను హెచ్చరించారు. మ‌రి ఇప్ప‌టికైనా సీరియ‌స్‌గా ఈ విష‌యంపై దృష్టిపెడ‌తారో లేదో!!