యూపీలో కూడా అదే రిజ‌ల్ట్ వ‌స్తుందా..!

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజ‌యం కోసం అధికార ఎస్పీతో పాటు అక్క‌డ ప్ర‌ధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఇక్క‌డ విజ‌యం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వ‌ర‌కు సుగ‌మం అయిన‌ట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను త‌మ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీల‌న్ని స‌ర్వ‌శ‌క్తులా పోరాడుతున్నాయి.

అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ప్ర‌కారం బీజేపీకి బీహార్ తరహా అనుభవం తప్పేట్లు లేదు. మూడు పార్టీలనేతల ఆధ్వర్యంలో ఏర్పడిన లౌకిక మహాకూటమి బలంగా కనబడుతోంది. దీంతో నిన్న‌టి వ‌ర‌కు బ‌లంగా ఉన్న‌ట్టు క‌న‌ప‌డిన బీజేపీ బాగా బ‌ల‌హీన‌మైంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చొరవతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డి) అజిత్ సింగ్ కలిసి కూటమిగా ఏర్పడ్డారు.

నిన్న‌టి వ‌ర‌కు ములాయంసింగ్ ఫ్యామిలీలో ఏర్ప‌డిన విబేధాల‌తో గెలుపు త‌మ‌దే అని బీజేపీ ముందే సంబ‌రాలు చేసుకుంది. అయితే అఖిలేష్ దాన్ని చాలా సులువుగా అధిగ‌మించేశాడు. ఇప్పుడు యూపీలో బెస్ట్ సీఎం ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు సైతం ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ప‌లు స‌ర్వేల్లో అఖిలేష్‌కే ఓట్లు వేస్తున్నారు. అఖిలేష్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఓట్లు చీలకుండా ‘లౌకికమహాకూటమి’ని ఏర్పాటు చేయటంతో భాజపాకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది.

యూపీలో సైతం కులాల‌కు ప్రాధాన్య ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉండి..గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 80 ఎంపీ స్థానాల‌కు ఏకంగా 72 సీట్లు గెలుచుకున్న బీజేపీలో ఇప్పుడు ఆ జోష్ లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు సైతం ఆ పార్టీకి పెద్ద మైన‌స్‌గా మారింది.

కులాల లెక్క ఇదే….

యూపీలోని అమేథి, రాయ్‌బ‌రేలి జిల్లాల్లో కాంగ్రెస్ చాలా బ‌లంగా ఉంది. జాట్ల‌లో (ఓసీ వ‌ర్గాలు) ఆర్ఎల్డీకి బాగా ప‌ట్టుంది. ఇక ముస్లింలు, యాద‌వుల్లో ఎస్పీకి తిరుగులేని బ‌లం ఉంది. ఈ మూడు పార్టీలు ఒకే కూట‌మిగా ఏర్ప‌డ‌డంతో ఈ కూట‌మి చాలా బ‌లోపేతం అయ్యింది. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు స్పీడ్‌గా ఉన్న బీజేపీలో ఇప్పుడు నీర‌సం ఆవ‌హించింది. ఇక బ్రాహ్మ‌ణులు, ఎస్సీల ఓట్ల కోసం బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా వాటా కోరుతోంది. బీజేపీ కేవ‌లం మోడీ మానియా మీదే ఆశ‌లు పెట్టుకుంది. ఏదేమైనా తుది ఫ‌లితాలు ఎలా ఉన్నా ప్ర‌స్తుతం యూపీలో బీజేపీ బండి స్లోగా మూవ్ అవుతోందన్న‌ది మాత్రం వాస్త‌వం.