ప‌వ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డారా

ఇప్పుడు అంద‌రూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన జ‌న‌సేని.. స్వ‌యంగా బాధితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. బాధితుల రోద‌న‌లు స్వ‌యంగా చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పుష్క‌రాల పేరుతో రూ.250 కోట్లు ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు జ‌నాలు నానాతిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలియ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ర‌కంగా అప్ప‌ట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ నేప‌థ్యంలో హుటా హుటిన స్పందించిన ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.

ఉద్దానం ప్రాంతంలోని సుమారు 800 మంది కిడ్నీ రోగుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వైద్య‌ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య – ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్క‌డి వారిలో రోగాలను నిర్థారించేందుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యంపై స్వ‌యంగా తానే ప్ర‌ధానిని క‌లిసి వివ‌రిస్తాన‌ని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీని కోసం తాను శుక్రవారం ఢిల్లీ వెళ్లి.. ప్రధాని నరేంద్ర మోదీ స‌హా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో భేటీ అవుతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇక్క‌డి రోగుల‌కు అన్ని విధాలా ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. మొబైల్‌ వైద్య పరీక్షల వాహనాలను ప్రారంభించిన‌ట్టు మంత్రి కామినేని చెప్పారు. వ్యాధికి ప్రధాన కారణమైన రెండు పరీక్షలతో పాటు అవ‌స‌ర‌మైన వారిని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు త‌ర‌లించి దాదాపు 40 రకాల అన్ని వైద్య‌ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామ‌ని వివ‌రించారు. రానున్న 60 రోజుల్లో పలాస – సోంపేట ప్రాంతాలలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌కు శాశ్వత పరిష్కారం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించిన‌ట్టు మంత్రి వివ‌రించారు. రోగులకు పింఛన్లు, బస్ పాస్ లు అందిస్తామన్నారు.

కాగా, ప్ర‌భుత్వం హుటా హుటిన ఈ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై స్థానికంగా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌శ్నిస్తానంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ నిజంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్న‌ల‌తో దుమ్ముదులిపార‌ని ప‌లువురు అంటున్నారు. ఇక‌, రోగుల బంధువుల క‌ళ్ల‌లో ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. త‌మ వారు రోగంతో పోరాడి ఉంటారో.. పోతారో కూడా తెలియ‌ని స్థితిలో ప‌వ‌న్ చొర‌వ తీసుకోవ‌డం, దీనికి ప్ర‌భుత్వం హుటాహుటిన స్పందించ‌డం నిజంగా త‌మ‌కు ఎంతో సంతోషాన్ని నింపింద‌ని వారు అంటున్నారు. ఇక‌, ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన అభిమానుల్లో ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. ప‌వ‌నా! మ‌జాకా!! అని వారు నినాదాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.