ప‌వ‌న్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌క‌పోతే తాను ప్ర‌జా ఉద్య‌మాన్ని లేవ‌దీసి…దానిని తానే స్వ‌యంగా లీడ్ చేస్తాన‌ని కూడా చెప్పాడు.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది. ఈ వార్త‌లు అధికార పార్టీలో పెద్ద క‌ల‌క‌లం రేపాయి. ప‌వ‌న్ శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనకు విశాఖ నుంచి స‌ద‌రు టీడీపీ ఎమ్మెల్యేనే వాహనం (ఎండీవర్‌ కారు) ఏర్పాటు చేసినట్టు పార్టీకి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. దీంతో ఈ వివాదంపై స‌ద‌రు ఎమ్మెల్యే స్పందించారు.

ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు..విశాఖ జిల్లా య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు. ప‌వ‌న్ శ్రీకాకుళం టూర్లో తాను స‌హ‌క‌రించిన‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని..ఈ వార్త‌లు నిజం అని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రమేష్‌బాబు ప్రకటించారు.

ఇక ఎండీవర్‌ కారు తమ కుటుంబంలో ఎవరికీ లేదని ఆయ‌న స్పష్టంచేశారు. పంచకర్ల అంటే తానొక్కిడినే కానని, విశాఖలో అదే ఇంటిపేరుతో చాలా మంది ఉన్నారన్నారు. పంచకర్ల శ్రీనివాస్‌ అనే బిల్డర్‌ కుమారుడు పంచకర్ల సందీప్‌ గీతం వర్సిటీలో చదువుతున్నాడని, అతడో విద్యార్థి సంఘ నాయకుడని, అతనే పవన్‌కల్యాణ్‌కు ఏర్పాట్లు చేశారని వివరించారు.