త‌మిళ సీఎం దీపానే…! శ‌శిక‌ళ‌కు షాకే

`అమ్మ‌`ను కోల్పోయిన త‌మిళ‌వాసుల‌కు స‌రికొత్త ఆశా`దీపం` దొరికింది. త‌మిళ రాజ‌కీయాల‌ను శాశించాల‌ని కోరుకుంటున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు దీప రూపంలో ఊహించ‌ని షాక్ ఎదురైంది. జ‌య అన్న కూతురు దీపకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధిక‌మ‌వుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వ‌చ్చి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెను బ‌తిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు.

పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన `చిన్న‌మ్మ‌` శ‌శిక‌ళ‌.. సీఎం పీఠం ఎక్కేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇక పార్టీలో అంతా చిన్న‌మ్మే అని అగ్ర‌నేతలు అంటుంటే.. ప్ర‌జ‌లు, అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు మాత్రం ఆమె అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. జయలలిత ఆస్తికి, రాజకీయానికీ వారసులు ఎవరు? అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎవరికి అనే ప్రశ్నలు తలెత్తినపుడు శశికళతోపాటు దీప పేరు మార్మోగిపోయింది.

అన్నాడీఎంకేలోని అగ్రనేతల ప్రాభవంతో శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టినా పార్టీ నేతలు, కార్యకర్తల్లో దీప ప్రభావాన్ని మాత్రం చెరిపివేయలేక పోయారు. జయ వారసురాలు దీప మాత్రమే అనే నినాదంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటికి వేలాది మంది వ‌స్తున్నారు. ఆమె ఇంటి ముందు బారులు తీరుతూ.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్రాధేయ‌ప‌డుతున్నారు.

గురు, శుక్రవారాల్లో తిరునెల్వేలి, తూత్తుకూడి, దిండుగల్లు, మదురై, కోయంబత్తూరు, విళుపురం, ఈరోడ్, తిరువణ్ణామలై, తిరుప్పూరు 14 జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. దీప వారందరితో ఓపిగ్గా మాట్లాడుతూ నచ్చజెప్పి పంపుతున్నారు. తనను కలుసుకునేందుకు వచ్చే కార్యకర్తల వివరాలను నమోదు చేసేందుకు దీప తన ఇంటి ముందు రిజిస్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

జనం సాధారణ సంఖ్యలో ఉన్నపుడు ఇంటి ముంగిట, ఎక్కువగా ఉన్నపుడు మిద్దెపై బాల్కనీ నుంచి రెండాకుల గుర్తులా రెండువేళ్లను చూపడం ద్వారా మరింత ఉత్సాహపరుస్తుండ‌టం విశేషం!! దీప దూకుడు చూస్తుంటే ఆమె శ‌శిక‌ళ‌కు ఏకుమేకులా మారి సీఎం పీఠం అధిష్టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.