తెలంగాణ‌లో కేసీఆర్ టార్గెట్‌గా మ‌హాకూట‌మి

తెలంగాణలో సీఎం కేసీఆర్ బ‌ల‌మైన రాజ‌కీయ నేత‌గా మారిపోయారు. ప్ర‌తిప‌క్షంలో త‌న‌ను ఢీ కొట్టే నేత‌లెవ‌రూ లేకుండా చేయ‌డంలో విజ‌యం సాధించారు. వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తూ ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసి రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించారు. కేసీఆర్‌పై పోరాడేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు కోదండాస్త్రం అనే ఆయుధం దొరికింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోదండ‌రాంను ముందుంచి కేసీఆర్‌తో యుద్ధం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఆయ‌న నేతృత్వంలో ఒక మ‌హా కూట‌మి ఏర్పాటుచేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల్లో నాయ‌కత్వ లేమి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ కొట్టేయ‌లేక‌పోయింది కాంగ్రెస్‌. చంద్ర‌బాబు ఏపీ రాజ‌కీయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలో టీటీడీపీకి నాయ‌కుడు క‌రువ‌య్యాడు. ఇక వైసీపీ సంగ‌తి స‌రేస‌రి! దీంతో ఇన్నిరోజులూ విడివిడిగా కేసీఆర్‌ను ఎదుర్కోలేక‌పోయారు నాయ‌కులు. ఇదే స‌మ‌యంలో టీజేఏసీ క‌న్వీన‌ర్ కోదండ‌రాం.. ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో విడివిడిగా పోరాడితే లాభం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు నిర్ణ‌యించుకున్నాయి. కేసీఆర్ టార్గెట్‌గా క‌లిసిక‌ట్టుగా ఒక రాజ‌కీయ కూట‌మి ఏర్పాటుదిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

ఈ కూటమికి కోదండ‌రాం నాయ‌క‌త్వం వహించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కోదండ‌రాం.. దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే! ఈ రాజ‌కీయ కూట‌మికి ఈ దీక్ష‌లోనే బీజం ప‌డిందని స‌మాచారం. ఈ దీక్ష‌కు రేవంత్‌రెడ్డి, ఉత్త‌మ్‌కుమార్, ఇత‌రులు సంఘీభావం ప్ర‌క‌టించారు. విప‌క్షాల‌న్నీ ఏక‌మై ఒక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని నేత‌లు వ్య‌క్తంచేశార‌ట‌. దీంతో ఇప్పుడు ఈ కొత్త కూట‌మి చ‌ర్చ మొద‌లైంది.

ఈ కూట‌మిలో కాంగ్రెస్ – టీడీపీ – వామ‌ప‌క్షాలు – ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తోన్న కొన్ని సామాజిక సంస్థ‌లు సైతం క‌ల‌వ‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీలు విడివిడిగా పోటీ చేసినా, క‌లిసి పోటీ చేసినా అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ప్ర‌భుత్వంపై క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల‌ని వీరు కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి కేసీఆర్‌ను ఈ కూట‌మి ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే!!