గంటా మంత్రి ప‌ద‌వికి అదే శ్రీరామ‌ర‌క్ష‌

ప్ర‌భుత్వంలో ఎవరిపైనైనా అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే చాలు ప్ర‌తిపక్ష నేత‌లు ఇక త‌మ నోటికి ప‌నిచెబుతారు. అలాగే పేప‌ర్ల‌లోనూ వారికి సంబంధించిన వాటినే ప్ర‌ధానంగా ప్ర‌చురిస్తాయి. ఇక టీవీల్లో అయితే ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. మ‌రి ఇప్పుడు ఏపీలో ఒక మంత్రే కేసులో ఇరుక్కుంటే.. ప్ర‌తిప‌క్షాలు కిక్కురుమ‌న‌డంలేదు. ప‌త్రిక‌ల్లో ఎక్క‌డా ఆయ‌న గురించి చిన్న వార్త కూడా క‌నిపించ‌డంలేదు. అయితే ఇందుకు ఆయ‌న కుల‌మే శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారింద‌ని… అందుకే ధైర్యం చేసి ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌లేక‌పోతున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో సీఎం కూడా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారంటే.. ప‌రిస్థిలి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు!!

ఇండియన్‌ బ్యాంక్‌కు ఆస్తులను కుదువపెట్టి అప్పులు తీసుకుని మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం వాటిని ఎగ‌వేసింది. అయితే ఈ కేసులో మంత్రి, ఇత‌రుల పాత్ర స్ప‌ష్టంగా ఉన్నా.. ఇంత వరకు మంత్రిపై కానీ, ఆయన మిత్రులపై కానీ ప్రభుత్వం కానీ,బ్యాంకుల కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన వచ్చిన ఆరోపణలపై ఇంత వరకు ఆయన కూడా వివరణ ఇవ్వలేదు. అయితే ఈ విష‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై ఈగ వాలనివ్వకుండా చూస్తున్నార‌నే చ‌ర్చ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

టీడీపీ నేత‌లు ఎక్క‌డ దొరుకుతారా అని ఎదురుచూసే సాక్షి ప‌త్రిక కానీ, వైసీపీ నేత‌లు గాని ఈ విష‌యంపై కిమ్మ‌న‌డంలేదు. ఇందుకు కారణం ఆయ‌న సామాజిక‌వ‌ర్గ‌మేన‌ట‌. రాష్ట్రంలో ఒక‌ప‌క్క త‌మ హ‌క్కుల‌కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన గంటాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా అది పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నార‌ట‌. ఆ సామాజిక వ‌ర్గంలో టీడీపీపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌. ఇదే భ‌యంతో విపక్షాలు కూడా ఆయ‌న విమర్శ‌లు చేయ‌డం లేదు.

వాస్తవానికి కొంత కాలంగా మంత్రి ‘గంటా’ పనితీరుపై సీఎం ప‌నితీరుపై అసంతృప్తితో ఉన్నారు. విద్యాశాఖను గాలికి వదిలేశార‌నే విమ‌ర్శ‌లు ఇటీవ‌ల గుప్పుమంటున్నాయి. ఇవిగాక విద్యాశాఖలో జరిగే అవినీతి వెనుక ‘గంటా’ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ముఖ్యమంత్రికి చేరాయి. కానీ…రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ‘కాపు’ ఉద్యమం నేపథ్యంలో ‘గంటా’ విషయంలో సీఎం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు చెబుతున్నారు. ‘కాపు’ కులానికి చెందిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటే… విమర్శలు వస్తాయనే భావనతో ఇప్పుడు కూడా ‘చంద్రబాబు’ మౌనం వహించారని ఆ పార్టీలో కీలక వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు.