మోత్కుప‌ల్లి కొత్త ఆశ‌లు

కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మైంది. ప్ర‌తి ఒక్క‌రూ డైరీలు తెరిచేసి.. ఈ సంవ‌త్స‌రంలో ఏమేం చేసేయాలి? ఏమేం సాధించేయాలి? వ‌ంటి అనేకానేక విష‌యాల‌ను పుంఖాను పుంఖానులుగా నింపేసే ఉంటారు. ఇప్పుడు ఇదే జాబితాలో తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు చేరిపోయారు. అయితే, ఆయ‌నేమీ కొత్త కొత్త కోరిక‌లు, కొత్త కొత్త ఆశ‌లతో త‌న డైరీని నింపేసుకోలేదు! కేవ‌లం త‌న‌కున్న ఏకైక‌ పాత కోరిక‌, ఎడ‌తెగ‌ని దూర…. ఆశ‌ను మాత్ర‌మే డైరీలో మ‌రోసారి రాసేసుకుని.. నీళ్లు రాని పంపు కింద బిందె పెట్టి కూర్చున్న‌ట్టు.. ఎదురు చూస్తున్నారు!! ఎప్ప‌టికైనా పైవాడు క‌రుణించ‌క‌పోతాడా? అని రోజులు లెక్క‌పెట్టుకుంటున్నారు. విష‌యంలో వెళ్లిపోదాం..

జిహ్వ‌కో రుచి.. అన్న‌ట్టు టీడీపీ సీనియ‌ర్ నేత, విప‌క్షాల‌పై ఏక‌బిగిన విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల నేర్పు ఉన్న మోత్కుప‌ల్లి.. ఓ శుభ ముహూర్తాన రాష్ట్రం మొత్తానికి ప్ర‌థ‌మ పౌరుడ‌య్యే జాబ్‌పై క‌న్నేశారు. అంటే గ‌వ‌ర్న‌ర్ గిరీపై అన్న‌మాట‌! ఈ కోరిక ఎందుక‌లిగిందో తెలీదుకానీ.. దీనిపై చాలా పెద్ద పెద్ద క‌ల‌లే కన్నారు. ఇంకా కంటున్నారు కూడా! అయితే, ఇదేమంత తేలిక కాదు క‌దా! కేంద్రంలో ఉన్న ప్ర‌భువుల క‌రుణ ఉండాల్సిందే. ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి.. త‌న బాస్ ఏపీ సీఎం చంద్ర‌బాబుకు త‌న మ‌న‌సులోని కోరిక‌ను వెల్ల‌డించారు. పార్టీలో మీరు చెప్పిన‌ట్టు అన్నీ చేశారు. నా ఈ ఒక్క కోరిక తీర్చి జ‌న్మ చ‌రితార్థం చేయండి! అంటూ గ‌త మే నెల‌లో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌గా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

దీంతో మ‌న‌సు క‌రిగిపోయిన చంద్ర‌బాబు.. కేంద్రంలోని ఎన్‌డీఏతో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ గిరీపై సూప‌ర్ స్టైట్‌గా సిఫార్సు చేసేశారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. పూజారి క‌రుణించ‌లేద‌న్న‌ట్టు.. అస‌లు కేంద్రంలోని అధిష్టానం ఇప్ప‌టి వ‌ర‌కు క‌రుణించ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌వ‌ర్న‌ర్ గిరీ ప‌రిశీల‌న‌లో మోత్కుప‌ల్లి అని వార్త‌లు వ‌స్తున్నాయో త‌ప్ప‌.. అంత‌కు మించి ఒక్క అక్ష‌రం కూడా మీడియా రాయ‌లేక‌పోతోంది. దీంతో మోత్కుప‌ల్లి అనుచ‌రులు ఎదురు చూసీ చూసీ.. ఆశ‌లు వ‌దిలేసుకున్నారు. కానీ, మోత్కుప‌ల్లి మాత్రం పులుపు చావ‌ని వ్య‌క్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదే విష‌యాన్ని కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆయ‌న మ‌రోసారి విన్న‌వించారు. చూద్దాం.. మ‌రి ఆయ‌న ఆశ‌లు ఈ ఏడాదిలోనైనా తీర‌తాయో లేదో!!