టీఆర్‌ఎస్‌లో హ‌రీష్‌రావు ప్ర‌యారిటీ ఏంటి?

ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో అంతా తానై మేన‌మామ కేసీఆర్ చెప్పిన‌ట్టు న‌డుచుకొన్న ఎమ్మెల్యే హ‌రీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయార‌నే టాక్ విన‌బ‌డుతోంది. వాస్త‌వానికి తెలంగాణ‌లో ఏ స‌మ‌స్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్‌లోకి దూసుకుపోయి.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో హ‌రీష్‌.. త‌న స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌ను తొక్కేస్తున్నార‌నే టాక్ విన‌బ‌డుతోంది. టీఆర్ ఎస్‌లో ఆధిప‌త్య పోరు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప‌రోక్షంగా హ‌రీష్‌ను తెర‌వెనుక‌కే ప‌రిమితం చేస్తున్నార‌ని అంటున్నారు హ‌రీష్ అనుచ‌రులు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీలో అధికార ప‌క్షం త‌ర‌ఫున గ‌ట్టి గ‌ళం వినిపించ‌డంలో హ‌రీష్ ముందున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ సైతం హ‌రీష్‌ని చూసి మురిసిపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశాల్లో మాత్రం హ‌రీష్ ప్రాధాన్యం ఉద్దేశ పూర్వ‌కంగానే త‌గ్గించార‌ని తెలుస్తోంది. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్‌ కాకతీయను అమలు చేయడంతో హరీశ్‌రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఈ అంశం అసెంబ్లీలో చర్చకు కూడా రాలేదు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చిన రోజు మరో కీలకమైన అంశం తెరపైకి రావడంతో మిషన్‌ కాకతీయ పక్కకు పోయింది.

ఇక‌, ఇదే విష‌యంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ విషయాలన్నింటనీ దగ్గర నుంచి పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు… అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హరీశ్‌ ప్రాధాన్యత తగ్గుతూ, క్రమంగా కేటీఆర్‌ ప్రాముఖ్యత పెరుగుతోందన్న చర్చ ప్రారంభమైంది. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మీక్ష‌లో సైతం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ని ప‌రోక్షంగా పొగిడి ఆకాశానికి ఎత్తేశారు. ఇది మ‌రోర‌కంగా హ‌రీష్‌ను తొక్కేయ‌డ‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి 31 జిల్లాలున్న తెలంగాణ‌లో ఈ విధ‌మైన ప‌రిణామం మంచిది కాద‌ని అధికారులు చెబుతున్నారు.