టీ కాంగ్రెస్ సార‌థిగా అజారుద్దీన్‌

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్షాలు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి. కేసీఆర్ వేసే ఎత్తుల‌కు ప్ర‌తిప‌క్షాల‌న్ని చిత్తుచిత్త‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు ధీటుగా ఫైట్ చేయ‌లేక‌పోతోంద‌న్న అభిప్రాయం టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. టీ పాలిటిక్స్‌లో సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి – జానారెడ్డి – భ‌ట్టి విక్ర‌మార్క్ – కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి – డీకే అరుణ – జీవ‌న్‌రెడ్డి ఇలా ఎవ‌రిని చూసుకున్నా స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో కేసీఆర్‌కు తిరుగేలేకుండా పోతోంది.

వీరిలో ఎవ‌రికి బాధ్య‌త‌లు ఇచ్చినా మ‌రొక‌రు స‌రిగా స‌హ‌క‌రించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్టానం టీ పీసీసీకి చికిత్స చేసేందుకు ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌కు టీ పీసీసీ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో అజార్‌ను మైనార్టీ ఓట్ల‌ను కొల్ల‌గొట్టే ప్లాన్‌లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించింది. 2009లో అజార్ అక్క‌డి నుంచి ఎంపీగా గెలిచారు.

గ‌త ఎన్నిక‌ల్లో అజార్ మొరాదాబాద్ నుంచి రాజస్థాన్‌లోని జైల్మోర్‌కు మారి అక్క‌డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అజార్‌ను ఇప్పుడు సొంత రాష్ట్ర రాజ‌కీయాల్లోకి పంపాల‌ని అధిష్టానం భావిస్తోంద‌ట‌. తెలంగాణలో 14. 25 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉండ‌డం కూడా అజార్‌ను ఇక్క‌డ‌కు పంపేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంద‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు త‌లోదిక్కుగా ఉంటున్నార‌ని..వీరిని కాకుండా అజార్‌కు ఇక్క‌డ పీసీసీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే వారంతా లైన్లోకి రావ‌డంతో పాటు ముస్లి+రెడ్డి ఓటు బ్యాంకు క‌ల‌యిక‌తో కాంగ్రెస్‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకును ఏర్ప‌ర‌చాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అజార్ ముస్లిం ఓటుబ్యాంకు అధికంగా ఉన్న ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మ‌రి టీ కాంగ్రెస్‌కు అజార్ చికిత్స ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.