బాల‌య్య కోసం ఒప్పుకున్న కేసీఆర్‌

సినిమాలు.. తెలుగు రాజ‌కీయాల‌కు స‌మైక్యాంధ్ర‌లో ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించ‌డంతో ఈ బంధం మ‌రింత ధృడ‌మైంది. అవి నాటి నుంచి నేటి వ‌ర‌కు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రాజ‌కీయాలు – సినిమాల బంధం ఇప్పుడు తెలంగాణ‌లో కంటే ఏపీలోనే స్ట్రాంగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికార టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్ర‌ముఖ సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతికి రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను తెలంగాణ‌లో రిలీజ్ చేశారు. ఆడియో తిరుప‌తిలో జ‌రుగుతోంది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌ను అధికార టీడీపీ నేత‌లు సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్క‌డంతో పాటు బాల‌య్య అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండ‌డం, ఈ సినిమా స్టోరీ ఆంధ్ర‌దేశ రాజ‌ధాని అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని పాలించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కించ‌డంతో అంద‌రికి మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా ఆంధ్ర‌దేశం – అమ‌రావ‌తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన హిస్టార‌కిల్ సినిమా కావ‌డంతో శాత‌క‌ర్ణికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యార‌ట‌. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన‌ట్టు కూడా స‌మాచారం. అంతేకాదు, ఈ సినిమాకు తెలంగాణ‌లో కూడా ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చేందుకు చంద్ర‌బాబు స్వ‌యంగా కేసీఆర్‌తో మాట్లాడి ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చేలా ఒప్పించార‌ని తెలుస్తోంది.

కేసీఆర్ గ‌తంలో రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు. ఇప్పుడు శాత‌వాహ‌నులు తెలంగాణ‌లో కూడా కొంత భాగాన్ని పాలించ‌డంతో ఈ సినిమాకు అక్క‌డ కూడా ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.