జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ముద్ర‌గ‌డ‌..!

ఏపీలో కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డకు విప‌క్ష వైకాపా రోజు రోజుకు బాగా ద‌గ్గ‌ర‌వుతోన్న‌ట్టు క‌నిపిస్తోంది. ముద్ర‌గ‌డ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు చూస్తోన్న రాజ‌కీయ‌వ‌ర్గాలు సైతం ఇదే సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. గ‌తంలోనే ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మాన్ని ర‌గిల్చిన‌ప్పుడు ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ప‌ని చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో తిరుప‌తికి చెందిన వైకాపా నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కాపు గ‌ర్జ‌న‌కు ముందుగా ముద్ర‌గ‌డ‌ను క‌లిసి దానిపై చ‌ర్చించార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి.

తాజాగా మ‌రోసారి భూమన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి వెళ్లి మ‌రీ ముద్రగడను కలిసి పార్టీ త‌ర‌పున కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై త‌మ మద్దతు తెలిపారు. ఈ పరిణామంపై టీడీపీ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది. ముద్ర‌గ‌డ‌తో చాలా సేపు చ‌ర్చ‌లు జ‌రిపిన భూమ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కాపు రిజ‌ర్వేష‌న్ల పోరాటం న్యాయ‌బ‌ద్ధ‌మైంద‌ని… గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన హామీ మేర‌కు వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిందే అని డిమాండ్ చేశారు.

ముద్ర‌గ‌డ నిబ‌ద్ధ‌త ఉన్న వ్య‌క్తిగా ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ విష‌యంలో చంద్ర‌బాబు మోసం చేస్తే ప్ర‌భుత్వంపై అంద‌రూ తిర‌గ‌బ‌డాల‌ని..ఇందుకు వైకాపా కూడా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని మ‌రీ ఆయ‌న చెప్పారు. ఇక కొద్ది రోజుల క్రిత‌మే దాస‌రితో పాటు జ‌గ‌న్‌కు బంధువు అయిన ప్ర‌ముఖ సినీన‌టుడు మోహ‌న్‌బాబు సైతం జ‌గ‌న్‌ను క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దాస‌రి – మోహ‌న్‌బాబును సైతం జ‌గ‌న్ త‌న చెంత‌కు చేర్చుకుంటార‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే దాస‌రి-మోహ‌న్‌బాబు ఇక ముద్ర‌గ‌డ ఈ ముగ్గురు జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ప‌ని చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.

ఎట్టి ప‌రిస్థితుల్లోను 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తోన్న జ‌గ‌న్ ఆ ప్లాన్‌లో భాగంగానే ముద్ర‌గ‌డ‌ను త‌న వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే… దాస‌రి, మోహ‌న్‌బాబుతో పాటు ప్ర‌స్తుతం భూమ‌న ద్వారా ఆయ‌న్ను మంచి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నాల్లో జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో గాని..ప్ర‌స్తుత ప‌రిణామాలు మాత్రం జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లో ముద్ర‌గ‌డ ప‌ని చేస్తున్నార‌న్న సందేహాల‌కు తావిచ్చేలా ఉన్నాయి. జ‌గ‌న్ కాపుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు పెద్ద స్కేచ్చే వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.