బాబు ఇలాకాలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీలో విప‌క్ష వైసీపీకు రోజూ వ‌ల‌స‌ల షాక్ త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు వైసీపీలో మ‌రో వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి సీఎం అయినా ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీదే పై చేయి అయ్యింది. ఈ క్ర‌మంలోనే చిత్తూరు జిల్లాలో పార్టీలో ఇమ‌డ‌లేని వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికే వ‌రుస‌పెట్టి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌ల‌మ‌నేరు నుంచి వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన అమ‌ర్‌నాథ్ రెడ్డి త‌న సొంత గూడు టీడీపీలోకి చేరిపోయారు. ఇక టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన తంబ‌ళ్ల‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి సైతం ఇప్పుడు వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్ద‌రు గ‌తంలోనే టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు.

యువ‌కుడు అయిన ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి ఫ్యామిలీ పొలిటిక‌ల్ హిస్ట‌రీ అంతా టీడీపీతోనే ముడిప‌డి ఉంది. ముందు ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి తండ్రి ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న త‌ల్లి కూడా టీడీపీ ఎమ్మెల్యేలుగా కొన‌సాగారు. ఆ త‌ర్వాత చిన్న వ‌య‌సులోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప్ర‌వీణ్ కుమార్ రెడ్డికి కూడా చంద్ర‌బాబు మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. 2009లో ప్ర‌వీణ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ త‌ర్వాత ప్ర‌వీణ్ వైసీపీ గెలుస్తుంద‌న్న అంచ‌నాతో టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీలోకి జంప్ చేసేశారు. జ‌గ‌న్ సైతం ప్ర‌వీణ్‌కు మంచి ప్ర‌యారిటీనే ఇచ్చారు. తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గ ఇంచార్జీతో పాటు రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడి బాధ్య‌త‌లు కూడా ఇచ్చారు. అయితే ప్ర‌వీణ్ అనూహ్యంగా తంబ‌ళ్ల‌ప‌ల్లి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌వీణ్ అస్స‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేదు.

ఈ క్ర‌మంలో ఒక‌టికి రెండు సార్లు చెప్పి చూసిన జ‌గ‌న్ ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. పార్టీ సీనియ‌ర్ నేత, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోద‌రుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో షాక్ అయిన ప్ర‌వీణ్ తిరిగి త‌న సొంత గూడు టీడీపీకి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ప్ర‌వీణ్ ఇప్ప‌టికే టీడీపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌వీణ్ త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌తార‌ని స‌మాచారం.