జ‌గ‌న్ పోరాట పంథా మారిందా..?

రాజ‌కీయంగా ప‌వ‌న్ గండాన్ని త‌ప్పించుకునేందుకు ప్ర‌త్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్..  ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖ‌లో తొలి  స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన బహిరంగ సభల్లో  మొద‌టిదైన ఈ స‌భ‌లో విప‌క్ష నేత‌ జగన్ ప్ర‌సంగించిన తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఇపుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా జ‌గ‌న్ స‌భ  అంటేనే  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌రుష వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శించ‌డం, ఇక త్వ‌ర‌లోనే తాను అధికారంలోకి వ‌చ్చేస్తున్న‌ట్లుగా కార్య‌క‌ర్త‌లకు న‌మ్మ‌కం క‌లిగించ‌డం ఈ బాణీలోనే ఇప్ప‌టిదాకా సాగిపోతూ వ‌చ్చాయి.

అయితే తొలిసారిగా జ‌గ‌న్ త‌న పంథాను మార్చుకుని  తాజాగా జ‌రిగిన స‌భ‌లో స‌బ్జెక్ట్ ఆధారంగా వివిధ అంశాల‌పై స్పందించార‌ని, ఏర‌కంగా చూసినా ఆయ‌న‌లో ఇది గ‌ణ‌నీయ‌మైన మార్ప‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో ఒరిగేది ఏమీ లేద‌ని ఇప్పుడు చెప్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు అదే హోదా కోసం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేయించారని సూటిగా ప్ర‌శ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అబద్ధాలు చెప్పారని, ఆర్థిక సంఘం ఎప్పుడూ అలా చెప్పలేదని అందులోని సభ్యుడే లిఖిత పూర్వకంగా చెప్పారని జగన్ తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అద‌నంగా, ఒక్క రూపాయైనా ఇచ్చిందా?  అంటూ.. సూటి ప్ర‌శ్న‌లు, వాస్త‌వ ఆధారిత వివ‌ర‌ణలు… జ‌గ‌న్ డిమాండ్‌లో లాజిక్ ఉంద‌ని ప‌లువురిని భావించేలా చేయడంలో ఆయ‌న విజ‌యం సాధించార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి పలు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య చెప్పడం కేవ‌లం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికేన‌ని జగన్ అన్నారు. కేవలం కోటి జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా వీటన్నింటికి మించిన విద్యా సంస్థలను నెలకొల్పార‌ని, ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే తప్ప, కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమని నమ్మిన బాబు… ఇప్పుడు ప్యాకేజీతో ఎలా సరిపెట్టుకున్నారని జగన్ ప్రశ్నించారు. గత ఏడాది విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు, 300కు పైగా పరిశ్రమలు వస్తాయని చెప్పారని, ఇప్పుటిదాకా వాటిలో ఎన్నిపెట్టుబ‌డులు వ‌చ్చాయో చెప్పాల‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఈసంద‌ర్బంగా జ‌గ‌న్‌ ప్రత్యేక హోదాయే రిఫరెండమ్‌గా 2019 ఎన్నికలకు వెళతామని  ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీ అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తుందో, ఆ పార్టీకి మద్దతు ఇస్తామని స్ప‌ష్టం చేశారు.  హోదా వలన క‌లిగే ప్రయోజనాలు తెలిసిన మేధావులు మౌనంగా ఉండకూడదని, ఏపీ ప్రజలంతా చేయి చేయి కలిపి తనకు మద్దతు ఇస్తే హోదా సాధించి తీరుతానని జ‌గ‌న్  బ‌హిరంగ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు త‌ట‌స్థుల‌ను కూడా ఆక‌ట్టుకునేలా ఉంద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌కులు అంటున్నారు.