అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అంత‌రిక్ష పోలింగ్‌

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఇప్పుడు ప్ర‌పంచాన్ని వేడెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అధ్య‌క్ష బ‌రిలో మాజీ మంత్రి, డెమొక్రాట్ల త‌ర‌ఫున హిల్ల‌రీ క్లింట‌న్‌, రిప‌బ్లిక‌న్ల త‌ర‌ఫున డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ ప‌డుతున్నారు. వీరి మ‌ధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 8న మంగ‌ళ‌వారం(నేడు) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి ఏడు గంట‌ల నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభం అవుతాయి. అయితే, అత్యంత ఆల‌స్యంగా లాస్ ఏంజెల్స్‌లో జ‌రుగుతాయి. కాల‌మానం ప్ర‌కారం అమెరికాలో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని గంట‌ల తేడాతో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం స‌హ‌జ‌మే.

 

ఇక అస‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి.. అమెరికాకు చెందిన నాసా శాస్త్ర‌వేత్త‌లు కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటుంటారు. అయితే, వీరు ఒక్కొక్క‌సారి అంత‌రిక్షం నుంచే ఎన్నిక‌ల్లో పాల్గొంటారు. తాజాగా  షేన్‌ కింబ్రౌ అనే శాస్త్రవేత్త స్పేస్ నుంచే త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఎన్నిక‌లు అధికారికంగా ప్రారంభం కావ‌డానికి కొన్ని గంట‌ల ముందే ఆయ‌న ఈ విధంగా త‌న ఓటును అధికారుల‌కు ఫార్వ‌ర్డ్ చేశారు. సోయుజ్‌ రాకెట్‌లో ఫోర్త్‌ మిషన్‌ రీసెర్చ్‌ కోసం షేన్ గ‌త నెల 19న అంత‌రిక్షానికివెళ్లారు. ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు. అయితే, బాధ్య‌త గ‌ల పౌరునిగా.. ఆయ‌న అంత‌రిక్షం నుంచే ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం గ‌మ‌నార్హం.

 

వాస్త‌వానికి అమెరికా శాస్త్ర‌వేత్త‌లు స్పేస్ నుంచి ఓటు హ‌క్కు వినియోగించుకోవడం ఇది తొలిసారి కాదు.. అంతరిక్షం నుంచి 1997 నుంచి సైంటిస్టులు త‌మ ఓట్లు వేస్తున్నారు. ఇలా ఓటు హ‌క్కును వినియోగించుకున్న వారిలో ప్ర‌థ‌ముడు డేవిడ్‌ ఉల్ఫ్‌ అనే శాస్త్ర‌వేత్త‌. ఇదే నేప‌థ్యంలో ఇప్పుడు కింబ్రౌ కూడా ఓటు వేశారు. అయితే, ఈయన  ఓటు హ‌క్కును ఆయ‌న ఎలా వినియోగించుకున్నారో, ఏ ప‌ద్ధ‌తి ద్వారా అక్క‌డి నుంచి సెండ్ చేశారో మాత్రం అధికారులు తెలప‌లేదు