ఏపీ హోదాపై ప్ర‌జా బ్యాలెట్‌లో షాకింగ్ రిజ‌ల్ట్‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే ఇటు కాంగ్రెస్‌, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ స‌హా సీఎం చంద్ర‌బాబు, కేంద్ర మంత్రి వెంక‌య్య‌లు హోదా క‌న్నా ప్యాకేజీ ముద్ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. భ‌విష్య‌త్తులో అస‌లు హోదా అనే మాట ఉండ‌ద‌ని కూడా వెంక‌య్య ఇప్ప‌ట‌కే స్ప‌ష్టం చేశారు. ఇక‌, ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌జా బ్యాలెట్ పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. హోదా విష‌యంలో ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు?  వారికి అస‌లు హోదా కావాలా? వ‌ద్దా? అనే ప్ర‌ధాన అంశాల‌పై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా.. క‌ర్నూలులో సోమ‌వారం ప్ర‌జాబ్యాలెట్ నిర్వ‌హించారు.  ప్ర‌త్యేక హోదా స‌హా రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌పై ఆయ‌న ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హించారు. దీనికి స్థానికంగా మంచి స్పంద‌నే వ‌చ్చింది. అనంత‌రం, వీటిని ఓపెన్ చేసి లెక్కించారు. ఈ సంద‌ర్భంగా షాకింగ్ రిజ‌ల్ట్ రావ‌డం గ‌మ‌నార్హం. అస‌లు వాస్త‌వానికి బాబు ప్ర‌చారం ప్ర‌కారం ఎవ‌రూ హోదా కోసం ఎదురు చూడ‌ర‌ని అనుకున్నారు. కానీ, దీనికి వ్య‌తిరేకంగా దాదాపు 18 వేల మంది త‌మ‌కు హోదా నే ముద్ద‌ని తేల్చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరా మాట్లాడుతూ..  హోదా కావాలని 18,693, వద్దని 28 మంది ఓటేసిన‌ట్టు చెప్పారు. అదేవిధంగా చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన‌ హామీలు నెరవేర్చలేదని 18,311, నెరవేర్చారని 32 మంది ప్రజలు ఓట్లేసినట్లు చెప్పారు.  రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు తిరిగిన వీధుల్లోనే తామూ తిరిగామని, సీఎంకు బ్రహ్మరథం పట్టిన ప్రజలే ప్రత్యేక హోదా డిమాండ్‌పై తమను ఆదరించారని ర‌ఘువీరా చెప్పారు. ప్రత్యేక హోదాను కాదంటే బీజేపీ, టీడీపీలను ప్రజలు గంగలో కలుపుతారని హెచ్చరించారు. మొత్తానికి హోదా విష‌యం ముగిసిన అధ్యాయ‌మ‌ని భావిస్తున్న త‌రుణంలో ఇలాంటి రిజ‌ల్ట్ రావ‌డం నిజంగానే పొలిటిక‌ల్‌గా పెద్ద సంచ‌ల‌న‌మ‌ని చెప్పొచ్చు.