కోన‌సీమ‌లో టెన్ష‌న్‌…. హైటెన్ష‌న్‌

తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌చ్చ‌ద‌నం ప‌ర‌వ‌ళ్లు తొక్కే.. కోన‌సీమ‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. ఠ‌క్ ఠ‌క్ ఠ‌క్ మ‌నే పోలీసు బూటు చ‌ప్పుళ్లు హోరెత్తిస్తున్నాయ్‌! ప్ర‌శాంత సీమ‌లో ఎవ‌రిని ప‌ల‌క‌ల‌రించినా టెన్ష‌న్‌.. ఏ కూడ‌లిలో చూసినా హై టెన్ష‌న్‌!! కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం రేప‌టి నుంచి(బుధ‌వారం) చేప‌ట్ట‌నున్న స‌త్యాగ్ర హ పాద‌యాత్ర నేప‌థ్యంలో పోలీసులు భారీ ఎత్తున కోన‌సీమ ప్రాంతంలో మోహ‌రించారు. అమలాపురం, రావులపాలెం, మంద‌ప‌ల్లి త‌దిత‌ర ప్ర‌ధాన ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేశారు.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మూడు నెల‌ల కింద‌ట త‌న భార్య‌తో క‌లిసి ముద్ర‌గ‌డ చేప‌ట్టిన దీక్ష పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఆయ‌న‌ను ఆస్ప‌త్రిలోనూ చేర్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న త‌న కాపు జాతిని చైత‌న్యం చేసేందుకు స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర చేప‌ట్టారు. త‌న స్వ‌గ్రామం కిర్లంపూడి నుంచి ప్రారంభించే యాత్ర‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే, ప్ర‌భుత్వం మాత్రం ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు ఎలాంటి అనుమ‌తినీ ఇవ్వ‌లేదు. పైగా జిల్లా అంత‌టా సెక్ష‌న్ 30ని అమ‌లు చేస్తోంది. అంతేకాకుండా.. సాక్షాత్తూ హోం మంత్రి చిన‌రాజ‌ప్ప ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ దీక్ష‌కు ఎలాంటి అనుమ‌తీ లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో డీజీపీ సైతం ఆ జిల్లాలో గ‌తంలో జ‌ర‌గిన పాద‌యాత్ర‌ను అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌లో రావాల్సిన గ‌డువు వ‌చ్చేసింది. దీంతో గ‌త రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున పోలీసు ఉన్న‌త‌స్థాయి అధికారులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ.. ప‌రిస్థితిని ప్ర‌త్యేకంగా అద్య‌య‌నం చేశారు. ఈ క్ర‌మంలో వివిధ జిల్లాల నుంచి కూడా సిబ్బందిని ఇక్క‌డికి మోహ‌రించారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో అయిదుగురు ఏఎస్పీలు, 30మంది డీఎస్పీలు, వంద మంది సీఐలు, 200 మంది ఎస్‌ఐలు, 2500 మంది భద్రతా బలగాలు రాష్ట్రం నలుమూలల ఉంచి కోనసీమకు చేరుకున్నాయి.

అయితే, ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఆఖ‌రికి త‌న చేతుల‌కు సంకెళ్లు వేసి, నోటికి న‌ల్ల‌రిబ్బ‌న్ క‌ట్టినా.. ఎలాగైనా స‌క్సెస్ చేయాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, కాపుల‌కు ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా కాబ‌ట్టి.. వైకాపా నేత జ‌గ‌న్‌తో కుమ్మ‌క్క‌యి.. ప్ర‌భుత్వంపై యుద్ధం చేస్తున్న ప‌ద్మ‌నాభం యాత్ర‌ను విఫ‌లం చేయాల‌ని ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కోన‌సీమ ప్రాంతంలో తీవ్ర‌స్థాయిలో టెన్ష‌న్ నెల‌కొంది. కాపు సానుభూతి ప‌రులు, నేత‌ల‌ను ముందే అరెస్టు చేయ‌డ‌మా? లేక గృహ‌నిర్బంధం చేయ‌డ‌మా అనే ఆలోచ‌న‌లో పోలీసులు ఉన్నారు. ఏం చేసినా.. పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత రాకుండా చూడాల‌ని పైనుంచి ఆదేశాలు ఉండ‌డంతో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏదేమైనా ఈ వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబుకు మ‌రో టెన్ష‌న్ ప‌ట్టుకుంది.