ఆ మంత్రితో వేగ‌లేం అంటోన్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్ర మంత్రి, ద‌ళిత నేత‌ రావెల కిశోర్ బాబుకి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎదురుగాలి వీస్తోందా? ఆయ‌న ప‌ట్ల స్థానిక టీడీపీ నేత‌ల్లో సానుభూతి త‌గ్గుతోందా? మంత్రి ప‌ట్ల స్ఠానిక టీడీపీ త‌మ్ముళ్లే ఆగ్ర‌హంతో ఉన్నారా? 2019లో ఈ ప‌రిణామం ప్ర‌భావం చూప‌నుందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా తెర‌మీద‌కి వ‌చ్చిన రావెల‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసి.. ప్ర‌త్తిపాడు సీటు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అధినేత పిలుపుతో స్థానిక నేత‌లు రావెల గెలుపున‌కు కృషి చేశారు.

వాస్త‌వానికి ఎన్నిక‌లంటే కోట్ల‌లో ఖ‌ర్చు పెట్టాల్సిందే. కానీ, ప్ర‌త్తిపాడులో త‌న సామాజిక వ‌ర్గం వారే ఎక్కువ‌గా ఉండ‌డంతో రావెల పెద్ద‌గా ఖ‌ర్చు పెట్టింది ఏమీ లేద‌ట‌. మొత్తం సామాజిక వ‌ర్గం వారే కాకుండా టీడీపీకి నిబద్ధత‌గా ఉన్న నేత‌లు రావెల గెలుపున‌కు సాయం చేశారు. దీంతో ఆయ‌న అధికారంలోకి రావ‌డం, మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌డం జ‌రిగిపోయాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న త‌న‌ను గెలిపించిన స్థానికుల‌ను, టీడీపీ నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డ‌మే కాకుండా వారిని తీవ్రంగా అవ‌మానిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు.. ఆందోళ‌న‌లు కూడా తెర‌మీద‌కి వ‌స్తున్నాయి.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రావెల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన ఓ వ‌ర్గాన్ని మంత్రి ఇప్పుడు చేర‌దీశార‌ని, రావెల గెలుపున‌కు ఎంతో క‌ష్ట‌ప‌డి, డ‌బ్బులు సైతం ఖ‌ర్చుపెట్టిన మ‌మ్మ‌ల్ని అవ‌మానిస్తున్నార‌ని ప్ర‌త్తిపాడులోని దాదాపు 15 గ్రామాలకు చెందిన టీడీపీ త‌మ్ముళ్లు పేర్కొంటున్నారు. రావెల సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు అధికారులు, జిల్లాస్థాయి నేత‌లు కుమ్మ‌క్క‌యి.. టీడీపీ త‌మ్ముళ్ల‌పై ప్ర‌తాపం చూపుతున్నార‌ని అంటున్నారు. మంత్రి సైతం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. క‌నీసం గౌర‌వం కూడా ఇవ్వ‌డంలేద‌ని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక అధికారి బదిలీ వ్యవహారంలో 15 గ్రామాల సర్పంచ్‌లు..ఎంపిటిసిలు…ఇతర సీనియర్‌ కార్యకర్తలు కలసి మంత్రిని కలవగా ఆయన వారిపై అకారణంగా మండిపడుతూ…ఫస్ట్‌ ఆల్‌ ఆర్‌ యు గెట్ అవుట్‌ మై హౌస్‌ అంటూ కేకలు వేశారట.

దీంతో హ‌ర్ట్ అయిన వీరంతా.. మంత్రికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగారు. దీన్ని తెలుసుకున్న మంత్రి రావెల తన మనుషులను వారి దగ్గరకు పంపించారు. ‘మేము…రామని..వీరందరూ మొండికేశారు…! విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు తాను నియోజకవర్గ పర్యటనలో ఉన్నానని, పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను బజారును పెట్టవద్దని బతిమాలి.. బుజ్జగించడంతో వారు నిరసన కార్యక్రమానికి ముగించారు. కానీ, వీరంతా మాత్రం ఇలాంటి మంత్రి మాకు వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. మ‌రి వీరంతా 2019లో త‌మ త‌డాఖా నిజంగానే చూపిస్తే.. రావెల ఇక ఇంటికే!! ఏం జ‌రుగుతుందో చూడాలి.