సోము వీర్రాజు… కామెడీ రాజ‌కీయం..!

గ‌త ఎన్నిక‌ల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూట‌మి ఏపీలో అధికార పీఠాన్ని ద‌క్కించుకోగ‌లిగింది. తెలంగాణ‌లో ఈ కూట‌మి ప్ర‌భావం ప‌రిమితంగానే ప‌నిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లైన ద‌గ్గ‌ర్నుంచే రెండు పార్టీల స్థానిక నేత‌ల మ‌ధ్య విభేదాలు పొడ‌చూప‌డ‌మే కాకుండా అస‌లు ఈ రెండూ మిత్ర ప‌క్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి.

ఇక ఏపీ విష‌యానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హ‌వా కొన‌సాగుతుండ‌టంతో రాష్ట్రంలో కూడా త‌మ బ‌లం  పెరిగిపోయింద‌ని.. ఆ పార్టీ స్థానిక నేత‌లు చాలా ఎక్కువ‌గా అంచ‌నా వేసుకుని మిత్ర ప‌క్షమ‌ని కూడా చూడ‌కుండా అధికార టీడీపీపై మాట‌ల తూటాల‌తో రెచ్చిపోయారు. ఓ ర‌కంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. రాష్ట్రంలోనూ పార్టీ బ‌ల‌ప‌డేందుకు కృషి చేయాల‌న్న పిలుపు కూడా ఇక్క‌డ ఆ పార్టీ నేత‌ల అత్యుత్సాహానికి కార‌ణ‌మ‌ని చెప్పాలి.

ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీకి రాష్ట్రంలో భ‌విష్య‌త్తు లేద‌ని భావించి బీజేపీ గూటికి చేరిన  ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి, క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ వంటివారు ముందు వ‌రుస‌లో ఉండేవారు. ఇక వీరిని మించి టీడీపీపై చెల‌రేగిపోయిన వ్య‌క్తి సోము వీర్రాజు. అంత‌కు ముందు సొంత ఊరు రాజ‌మండ్రిలో కూడా చాలామందికి ఇత‌డి పేరు తెలియ‌దనే చెప్పాలి.  అయితే కాలం క‌లిసి రావ‌డంతో టీడీపీ ద‌న్నుతో  ఏకంగా..ఎమ్మెల్సీ అయిన ఈ బీజేపీ నేత కొంత కాలం క్రితం… టీడీపీని చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డంతో అంద‌రినీ మించిపోయి రాజ‌కీయ నేత‌ల‌నే ముక్కున వేలేసుకునేలా చేశారు.  ఇక్క‌డ టీడీపీ త‌మ‌ను తొక్కేస్తోంద‌ని, విడిపోయి త‌మ స‌త్తా చాటుదామ‌ని ఈ వీర్రాజుగారు ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లి చెప్పిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

బ‌ల‌మైన కాపు సామాజిక నేప‌థ్యం ఉండ‌టం, ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో సన్నిహితంగా ఉండ‌టంతో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కావ‌డం లాంఛ‌నమేన‌న్న అభిప్రాయాలు గట్టిగానే వినిపించాయి..   అయితే కేంద్రం.. రాష్ట్రానికి హోదా విష‌యంలో మొండి చేయి చూపించ‌డం, సాయం చేసేందుకు నిధులు రాల్చేందుకూ మీన‌మేషాలు లెక్కించ‌డం నేప‌థ్యంలో ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఒక్క‌సారిగా కింద‌కు జారిపోయిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా… హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రంపై విమ‌ర్శ‌లు కురిపిస్తూ.. బీజేపీకి దూరంగా జ‌ర‌గ‌డంతో సోము వీర్రాజులాంటి చోటా మోటా నేత‌ల ప‌రిస్థితి ఒక్క‌సారిగా అయోమ‌యంగా మారిపోయింది. దీనికి తోడు రాష్ట్రంలో త‌మ ప‌రిమితులేమిటో బీజేపీ పెద్ద‌ల‌కు కూడా బాగానే తెలిసొచ్చిన‌ట్టు స‌మాచారం…వాస్త‌వ ప‌రిస్థితి త‌మ‌కు తెలియ‌నీయ‌కుండా త‌మ రాజ‌కీయ ఎదుగుద‌లకు ప్ర‌య‌త్నించిన వీర్రాజు లాంటి వారిపై బీజేపీ అధిష్టానం కూడా క‌న్నెర్ర చేయ‌డంతో సోముకి ప‌గలే చుక్కలు క‌నిపించాయ‌ట‌.

దీంతో ఒక్క‌సారిగా ఊహాలోకాల్లోంచి నేల‌మీద‌కు దిగివ‌చ్చిన సోము వీర్రాజు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద బెంగ‌తో చంద్ర‌బాబును మంచి చేసుకోవ‌డం త‌ప్ప త‌న‌కు వేరే గ‌త్యంత‌రం లేద‌ని వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనికితోడు ఏపీలో మంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలోనే ఉంటుందన్న వార్తలతో.. మిత్ర ప‌క్షం కోటాలో త‌న‌కూ ఏదైనా బెర్త్ దొర‌క‌క‌పోతుందా అన్న‌ట్టు..  ప్ర‌స్తుతం వీర్రాజు చంద్ర‌బాబు చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తీరు చూసేవారికి హాస్యం పుట్టిస్తోంది. ఇటీవల వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రారంభోత్సవం జ‌రిగిన‌ సందర్భంగా సోము వీర్రాజు సీఎం చంద్రబాబును క‌లిసి  పూల బోకే ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా సోము వీర్రాజు ఒక్క‌సారిగా ప్లేటు ఫిరాయించి చంద్ర‌బాబును కాకాప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నించ‌డం.. సొంత పార్టీ బీజేపీ నేత‌లను  కూడా విస్మ‌యానికి గురి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు మాట‌లు న‌మ్మి తాము కూడా టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించామ‌ని ఇప్పుడు త‌మ‌ను న‌ట్టేట్లో ముంచి వీర్రాజు మాత్రం చంద్ర‌బాబుకు దగ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారు వాపోతున్నార‌ట‌. మ‌రి ఇలాంటి నేత‌ల‌ను చూసుకుని ఇక్క‌డ బీజేపీ అధికారంలోకి వ‌చ్చేయాల‌నుకోవ‌డం గుర్తుకొస్తే మంచి కామెడీ సినిమా చూసిన‌ట్టుంది క‌దూ…!