తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ఎస్ బ‌లం చూస్తే షాకే

తెలంగాణ ప్ర‌జ‌ల నాడిని, అనుక్ష‌ణం ప‌సిక‌డుతూ… పాల‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శిస్తూ.. అవ‌స‌ర‌మైన‌పుడు మళ్లీ ఉద్య‌మ భాష‌ను ఉప‌యోగించి ప్ర‌త్య‌ర్థుల నోళ్లు, చేతులు క‌ట్టేస్తూ టీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయంగా అప్ర‌తిహ‌తంగా, ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత వేగంగా దూసుకుపోతున్నారు. సాధార‌ణంగా అధికారంలోకి వ‌చ్చాక రోజులు గ‌డుస్తున్న‌కొద్దీ.. అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో ఏదో ఒక స్థాయిలో వ్య‌తిరేక‌త రావ‌డం.. అది పెరుగుతూ పోవ‌డం స‌ర్వ సాధార‌ణవిష‌యం. కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విష‌యంలో ఈ సంప్ర‌దాయ లెక్క‌లేవీ… లెక్క‌లోకి రావ‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.

అవును.. కేసీఆర్ నాయకత్వ ప‌టిమ‌పై సొంత రాష్ట్రంలో ప్ర‌జ‌ల విశ్వాసం 2014 ఎన్నిక‌ల నాటిక‌న్నా ఇప్పుడు మ‌రింత పెరిగింద‌ని తాజా స‌ర్వే ఒక‌టి తేల్చి చెప్పింది.  కొత్త‌ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కేసీఆర్ సార‌థ్యంలోనే సాధ్య‌మ‌ని అక్క‌డి ప్రజానీకం ప్ర‌స్తుతం గ‌ట్టిగానే న‌మ్ముతున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘ‌న‌తను టీఆర్ఎస్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ సాధించింది బొటాబొటి మెజారిటీ మాత్ర‌మే… కాని ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఆ పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డి, తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ నిర్వహించిన అధ్యయనంలో తేటతెల్లమైంది. మిడ్ టర్మ్ హియరింగ్ పేరిట టీవీ9 చానల్ ఈ వివరాలను శుక్రవారం రాత్రి ప్రసారం చేసింది.

అధికారంలోకి వ‌చ్చిన‌ రెండున్నరేళ్ల  కాలంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం సాధించ‌గ‌లిగింది..?  ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజల అభిప్రాయాలెలా ఉన్నాయి…? ప‌్ర‌భుత్వ ప‌నితీరు ఎలా ఉంది…?  తెలంగాణ రాష్ట్ర స‌మితి బ‌లం పెరిగిందా.. త‌రిగిందా..?  ఈ ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన సమాధానం.. కేసీఆర్ పాల‌న చాలా బాగుంది అని…! ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తమ ఓటు టీఆర్ ఎస్ కేనని 109 నియోజకవర్గాల ప్రజలు ఏశ‌ష‌బిష‌లు లేకుండా తేల్చి చెప్పేశారు. ఇదీ.. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే సారాంశం.  కొత్త‌గా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు మొదలుకుని..  సంక్షేమ పథకాల అమలుదాకా… ముఖ్య‌మంత్రి కేసీఆర్ పని తీరు నుంచి.. స్థానిక ఎమ్మెల్యేల ప‌నితీరు దాకా.. అనేక ప్రశ్నలతో సేకరించిన అభిప్రాయాలు.. రాష్ట్రంలో టీఆర్ ఎస్ తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఆవిర్భ‌వించింద‌ని స్పష్టం చేస్తున్నాయి.

జిల్లాల పునర్విభజనకు ముందు పది జిల్లాలను ప్రామాణికంగా చేసుకుని నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? అని ప్రశ్నించగా.. 67.88% మంది టీఆర్ ఎస్ కేనని ఘంటాపథంగా తేల్చి చెప్పారని సర్వే వెల్లడించింది. టీఆర్ ఎస్ కు గత ఎన్నికల్లో కేవ‌లం 33.66% ఓట్లు వచ్చిన సంగతి ఈ సంద‌ర్భంగా గుర్తుంచుకోవాలి.  ఇక‌ నియోజకవర్గాలవారీగా ఈ స‌ర్వే ప్ర‌కారం.. ఇప్పుడు గ‌నుక‌ ఎన్నికలు జరిగితే 109 స్థానాల్లో టీఆర్ ఎస్ పాగా వేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.  మ‌రో విశేష‌మేమిటంటే ఐదు జిల్లాల్లో వందశాతం అసెంబ్లీ సీట్లు టీఆర్ ఎస్ ఖాతాలోకే చేరిపోయే అవ‌కాశ‌ముంద‌ట‌. అంటే గ‌త ఎన్నిక‌ల‌నాటితో పోల్చ‌తే టీఆర్ఎస్ బ‌లం ఎవ‌రూ ఊహించని స్థాయిలో పెరిగింద‌న్న‌మాట‌.

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా జారి పోవడం ఖాయ‌మ‌ని స‌ర్వే తేల్చింది.  ఆ పార్టీ కేవలం రెండు స్థానాలకే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ట‌. హైదరాబాద్ పాతబస్తీలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం మాత్రం ఏడు స్థానాలు గెల్చుకుని త‌న బ‌లం నిలుపుకుంటుంద‌ని స‌ర్వేలో తేలింది..ఇక వచ్చే ఎన్నికల్లో విజయం త‌మ‌దేన‌ని భావిస్తున్న టీడీపీ.. బీజేపీ – వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేసి ప్రాభవం చాటుకోవాలని ప్రయత్నిస్తున్న వామపక్షాలు ఊసు లేకుండా పోతాయని సర్వే పేర్కొంది.  ఓ ర‌కంగా వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం తమదేనని భరోసాతో ఉన్న కాంగ్రెస్ – టీడీపీ – బీజేపీలకు ఇది పెద్ద షాకేన‌ని చెప్పాలి.