ఏపీలో జంపింగ్‌ల‌కు షాక్ త‌ప్ప‌దా

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున షాక్ త‌గ‌ల‌నుంది. అప్ప‌ట్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు విసిరిన ఆక‌ర్ష్ దెబ్బ‌కి ఒక్క‌రొక్క‌రుగా జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చి మ‌రీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్ద‌తల‌కాయ‌లు గా భావించిన వారికి చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని అప్ప‌ట్లోనే హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా కేబినెట్‌లో ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి ప‌ద‌వి స‌హా ప‌లువురికి అమాత్య పీఠాలు అప్ప‌గిస్తాన‌ని బాబు హామీ ఇచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. ఆయా ప‌ద‌వుల‌పై పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్న వైకాపా నేత‌లు బాబు ఆఫ‌ర్‌కి ఫిదా అయిపోయారు.

దీంతో ఎప్పుడెప్పుడు మంత్రి వ‌ర్గం విస్త‌రిస్తారా అని వెయ్యి ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం వీరిని ఎప్ప‌టిక‌ప్పుడు ఊరిస్తూనే ఉన్నారు. ద‌స‌రా స‌మ‌యంలో ముహూర్తం కుదిరింద‌ని కొన్నాళ్లు ప్ర‌చారం కూడ సాగింది. ఇక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాక ఉంటుంద‌ని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఇంత‌లో ఇప్పుడు తాజా క‌బురు ఏంటంటే.. అస‌లీ జంపింగ్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కే ఛాన్సేలేద‌ని! ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. శుక్ర‌వారం పోలీసు అమ‌ర‌వీరుల దినో త్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో దాదాపు రెండున్న‌ర గంట‌ల‌పాటు చంద్ర‌బాబు భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో విస్త‌రించాల‌ని అనుకుంటున్న మంత్రి వ‌ర్గం విష‌యంపైనా చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించార‌ని ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైకాపా నుంచి జంప్ చేసి వ‌చ్చిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జ‌లీల్ ఖాన్‌ల‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పార‌ట బాబు. దీంతో ఒక్క‌సారిగా గ‌వ‌ర్న‌ర్ ఉలిక్కిప‌డి. అలాంటి ప‌ని మాత్రం చేయొద్ద‌ని బాబుకి హిత‌వు ప‌లికార‌ట‌. వారంతా జంపింగ్ ఎమ్మెల్యేల‌ని, వారిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటే లేనిపోని చిక్కులు వ‌స్తాయ‌ని, అవి చివ‌రికి నా మెడ‌కి చుట్టుకుంటాయ‌ని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించార‌ట‌.

అంతేకాదు, ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో తాను ఎదుర్కొన్న ఘ‌ట‌న‌ను ఆయ‌న చెప్పార‌ట‌. తెలంగాణ‌లో టీడీపీ నుంచి గెలిచి అధికార పార్టీ టీఆర్ ఎస్ కారెక్కిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ను త‌ర్వాత మంత్రిగా తీసుకున్నార‌ని, అయితే, దీనిపై పెద్ద ర‌చ్చ జ‌రిగింద‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో అది త‌న మెడ‌కుచుట్టుకుంద‌ని కూడా అన్నార‌ట‌. ఇదొక పెద్ద లెస్స‌న్ అనికూడా అన్నార‌ట‌. దీంతో చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్టు స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్‌ను కాద‌నే ధైర్యం చంద్ర‌బాబు చేయ‌లేరు. సో.. వైకాపా జంపింగ్‌ల‌కు షాక్ త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు!!