ప‌వ‌న్‌ వార్నింగ్ – టీడీపీ కౌంట‌ర్‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యం.. ఇప్పుడు జ‌న‌సేన‌, టీడీపీల మ‌ధ్య కౌంట‌ర్‌-రివ‌ర్స్ కౌంట‌ర్‌ల‌కు దారితీస్తోందా? అక్క‌డ ప్లాంట్ వ‌ద్దు, ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్టొద్దు అన్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ కౌంట‌ర్ ఇచ్చిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పార్క్ విష‌యంలో రైతుల గోడు విన్న ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం పెట్టి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా మీడియాకే వినిపించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి న‌దులు ప్రాధాన్యం తెలిసేలా.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పుష్క‌రాలు నిర్వ‌హించింద‌ని, మ‌రి ఆక్వా ప‌రిశ్ర‌మ‌తో జ‌లాలు క‌లుషితం చేయ‌డం, రైతుల‌కు ఇబ్బంది క‌లిగించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు.

అంతేకాకుండా 2014లో టీడీపీకి ప‌శ్చిమ‌గోదావ‌రి ప్ర‌జ‌లు కొమ్ము కాశార‌ని, వారి అండ‌తోనే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని, ఇప్పుడు అదే జిల్లా రైతుల‌కు అన్యాయం ఎలా చేస్తున్నార‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే ఆక్వా ప‌రిశ్ర‌మ‌ను వేరేచోట పొలాలు లేని చోట నిర్మించాల‌ని సూచించారు. అదేస‌మ‌యంలో సెక్ష‌న్ 144 విధించ‌డం, జ‌నాల‌పై కేసులు న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇలాంటివి మంచివి కావ‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబు స‌ర్కారుకి హెచ్చ‌రిక‌లు పంపారు. అయితే, గ‌తంలోనూ ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలోనూ చంద్ర‌బాబును ప‌ర‌క్షంగా ప‌వ‌న్ విమ‌ర్శించారు. పాచి ల‌డ్డూలు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు.

అయితే, అప్ప‌ట్లో సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేతలు ఆక్వా పార్క్ విష‌యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నిన్న ప‌వ‌న్ ప్ర‌సంగం అనంత‌రం, టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ పేరిట ఓ లెట‌ర్ విడుద‌లైంది. ఈ లెట‌ర్‌లో పేర్కొన్న కొన్ని విష‌యాలు ప‌వ‌న్‌కి కౌంట‌ర్‌గానే ఉన్నాయి. “రూ.800 కోట్ల పెట్టుబడితో 4000 మందికి పైగా యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంటే అడుకోవడం న్యాయమా?  పరిశ్రమలను వ్యతిరేకిస్తే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌శ్నించారు. కులతత్వం – ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం దేశద్రోహంతో సమానమని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని – రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, ఆక్వా పార్క్‌పై ప్ర‌భుత్వం గ‌తంలోనే స‌ర్వే చేయించింద‌ని, ఎలాంటి కాలుష్యం ఈ పార్క్ వ‌ల్ల రాద‌ని ఆ క‌మిటీ ప‌టిష్ట నివేదిక ఇచ్చింద‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు. అంటే.. ప‌వ‌న్ సూచించినట్టు .. పార్క్ విష‌యంలో క‌మిటీ వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని టీడీపీ స్ప‌ష్టం చేసిన‌ట్టే అవుతోంది. కాబ‌ట్టి ఈ విష‌యంలో పార్క్‌కు అనుకూలంగా తాము ముందుకు వెళ్తామ‌ని రాజేంద్ర ప్ర‌సాద్ త‌ర‌ఫున టీడీపీ చెప్ప‌క‌నే చెబుతోంద‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో ప‌వ‌న్‌కి ప్ర‌తి కౌంట‌ర్ ఇచ్చేయ‌డంలో టీడీపీ వెనుకాడే స‌మ‌స్యే లేన‌ట్టు క‌నిపిస్తోంది. సో.. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.