ఆ స‌మ‌స్య చంద్ర‌బాబును న‌లిపేస్తోందిగా

దేశం ఇప్పుడు క్లిష్ట ప‌రిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూత‌న్ ప్ర‌సాద్ డైలాగ్! అప్ప‌ట్లో ఇది పాపుల‌ర్ డైలాగ్‌. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే అనుకోవాల్సి వ‌స్తోంద‌ట‌! ప‌శ్చిమ గోదావ‌రిలో కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్ర‌బాబుని క్లిష్ట ప‌రిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వ‌ద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిస‌ర‌న గ‌ళం వినిపిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌కే ప‌రిమితం అయిన ఈ ఆందోళ‌న ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి పాకి.. చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంది. విష‌యంలోకి వెళ్లిపోతే.. ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం మండ‌లంలో ఉన్న తుందుర్రులో గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్  ఏర్పాటవుతోంది.

అయితే, దీనిని రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ పార్క్ విడుద‌ల చేసే వ్య‌ర్థ జ‌లాల‌తో పంట పొలాలు నాశ‌నం అవుతాయ‌ని, ఏడాదికి మూడు పంటలు పండే భూములు బీడులుగా మార‌తాయ‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో చేప‌ట్టిన ఆందోళ‌న ఇప్పుడు జ‌న‌సేనాని చెంత‌కు చేరింది. బాధితులు మూకుమ్మ‌డిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద త‌మ బాధ‌ను వెళ్ల‌గ‌క్కారు. దీంతో ప‌వ‌న్ బాధితుల ప‌క్షం చేరిపోయారు. వాస్త‌వానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి ఇప్పుడు కంచుకోట‌. ఇక్క‌డి ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాలు కాపులు, రాజులు కూడా టీడీపీకి అండ‌గా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే 2014లో వైకాపా అధినేత జ‌గ‌న్ ఎంత‌గా సెంటిమెంట్‌ను క‌లిపి కొట్టినా ఇక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం సైలెంట్‌గా సైకిల్ ఎక్కేశారు.

న‌ర‌సాపురం నుంచి బీజేపీ నేత గంగ‌రాజు ఎంపీగా గెల‌వ‌గా, మిగిలిన అసెంబ్లీ సీట్ల‌న్నీ టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఈ జిల్లాలోని రెండు ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాలూ చంద్ర‌బాబుకు అండ‌గా ఉన్నాయ‌నే చెప్పాలి. అయితే, ఇప్పుడు పరిస్థితి హీటెక్కింది. రాజుల వ‌ర్గానికి చెందిన వారు ఆక్వా పార్క్‌ను రూ.వంద‌ల కోట్లు పోసి నిర్మిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో భూములిచ్చిన కాపు వ‌ర్గానికి చెందిన రైతులు దీనిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఏ వ‌ర్గానికి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు మాట్లాడినా ప‌రిస్థితి ఎన్నిక‌ల్లో బోల్తా ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క‌, ఇదే విష‌యంపై మాట్లాడిన జ‌న‌సేనాని కూడా కుల ఘ‌ర్ష‌ణ‌లు విజృంభిస్తాయంటూ నిన్న హైద‌రాబాద్‌లోని ప‌బ్లిక్ గార్డెన్ వేదిక‌గా ఓ మాట అన్నారు.

దీనిని బ‌ట్టి ఈ ప‌రిణామం.. చంద్ర‌బాబుకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ప‌రిణ‌మించింది. దీంతో  చంద్రబాబు ఏం చేయాలి? పవన్ కోసం, ఆయనతో ఉన్నకాపు ఓట్ల కోసం ప్రాజెక్టును రద్దు చేయాలా? లేక రాజుల‌ మద్దతు కోసం ముందుకే వెళ్లాలా?  అనేది పెద్ద ప్ర‌శ్న‌గా ప‌రిణ‌మించింది. ఒక‌వేళ ఈ ప్రాజెక్టుకు స్థ‌లం మ‌రోచోట ఇస్తామంటే.. పంతాలు, ప‌ట్టింపుల‌కు ప్రాధాన్యం ఇచ్చే రాజులు దీనిని స్వీక‌రిస్తారా? అనే ది కూడా ప్ర‌శ్నే.  పోనీ, ప్ర‌జ‌ల‌నే ఎలాగైనా బుజ్జ‌గిద్దామా? అంటే ఇప్ప‌టికే తీవ్ర ఫైరింగ్‌లో ఉన్న జ‌నం బాబు పేరు చెబితే చాలు తీవ్రంగా మండిప‌డుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితిలో ఏం చేయాలి?  ఈ స‌మ‌స్య‌ని ఎలా ప‌రిష్క‌రించాలి? భ‌విష్య‌త్తులో చంద్ర‌బాబు ఏం చేస్తారు?  ఇవ‌న్నీ వేచి చూడాల్సిన విష‌యాలే!! ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, చంద్ర‌బాబు మాత్రం క్లిష్ట ప‌రిస్థితిలో ఉన్నార‌న‌డంలో ఎలాంటి డౌటూ లేదు.