కేసీఆర్ స‌త్తాకు..ఈ స‌మ‌స్య‌లే పెద్ద స‌వాల్‌

సంప‌న్న రాష్ట్రం ఏంటి? స‌మ‌స్య‌లేంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా?  ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించిన విష‌యం తెలిసిందే. 2014-15 లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ ప్ర‌భుత్వం రూ.7500 కోట్ల మిగులు బ‌డ్జెట్‌తో పాల‌న‌ను ప్రారంభించింది.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక సంఘ‌మే స్ప‌ష్టం చేసింది. దీంతో దేశంలో గుజ‌రాత్ త‌ర్వాత సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉందా? ప‌్ర‌భుత్వం డబ్బుల విష‌యంలో నిక్క‌చ్చిగానే వ్య‌వ‌హ‌రిస్తోందా? అంటే అంద‌రూ తెల్ల‌మొహం వేయాల్సి వ‌స్తోంది! ప్ర‌స్తుతం తెలంగాణ ఏర్ప‌డి రెండేళ్లుగ‌డిచి పోయాయి.

కేసీఆర్ ప్ర‌భుత్వం కొలువు దీరి కూడా రెండేళ్లు పూర్త‌య్యాయి. ఈ రెండేళ్ల కాలంలో మిగులు బ‌డ్జెట్‌గా ఉన్న  రాష్ట్రం ఒక్క‌సారిగా లోటు బ‌డ్జెట్‌లోకి వెళ్లిందా? ప‌్ర‌భుత్వం జారీ చేస్తున్న చెక్క‌లు బౌన్స్ అవుతున్నాయా?  విద్యార్థుల రీయింబ‌ర్స్‌మెంట్ స‌హా అన్ని ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌కూ నిధులు స‌రిపోవ‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబ‌రు మాసాల‌కే రాష్ట్రం 7000 కోట్ల రెవెన్యూలోటును ఎదుర్కొంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇంత లోటు రావ‌డానికి రాష్ట్ర ఆదాయం ఏమ‌న్నా త‌గ్గిందా? అంటే అదేమీలేదు. 15% రెవెన్యూ ఆదాయం పెరిగింది. మ‌రి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బులేక‌పోవ‌డం ఏమిటి? ప‌థ‌కాల‌కు నిధులు చెల్లించ‌లేక‌పోవ‌డం ఏమిటి? ఇప్పుడు అంద‌రినీ ఇదే విష‌యం తెలిచేస్తోంది.

ముఖ్యంగా ఉద్య‌మాల స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉన్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం  వంటి నేత‌లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ప్ర‌భుత్వం త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆర్థిక ప‌రిస్థితిని వెల్ల‌డించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల్లో ముఖ్య‌మైన‌వి.. రాజీవ్ ఆరోగ్య శ్రీ, విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌లు. వీటికి జ‌నాల్లో ఉన్న ఆద‌ర‌ణ అంతాఇంతా కాదు. అయితే, ఈ రెండు ప‌థ‌కాల‌కు ప్ర‌భుత్వం నుంచి నిధులు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఆరోగ్య శ్రీ కింద త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి బ‌కాయిలు రావ‌డం లేద‌ని ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు ఘొల్లుమంటున్నాయి. ఇలాగైతే సేవ‌లు నిలిపేస్తామ‌ని చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే కేసీఆర్ సీఎం అయిన త‌ర్వాత ఆస్ప‌త్రులు బెదిరించ‌డం ష‌రాగా మారింది. అంటే, ఎప్ప‌టిక‌ప్పుడు బ‌కాయిలు పేరుకుపోతున్నాయ‌న్న‌మాట‌.

ఇప్పుడు ఇదే వ‌రుస‌లోకి వ‌చ్చింది విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కొండలా పెరుగుతున్నాయి. అర్హమైన కాలేజీలకు బకాయిల చెల్లింపు ఎప్పుడు పూర్తి చేస్తారనేది మిస్టరీగా మారింది. గత రెండేళ్ల బకాయిలను ఇప్పటికైనా చెల్లించండి మహాప్రభో అంటూ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య విజ్ఞ‌ప్తి చేస్తున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.  మ‌రి సంప‌న్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిన తెలంగాణ ఇప్పుడిలా దిగ‌జార‌డానికి కార‌ణం ఏంటి? అంటే.. స‌ర్కారు చేస్తున్న అన‌వ‌స‌ర ఖ‌ర్చులే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

సీఎంకు క్యాంపు కార్యాల‌యం ఉండ‌గా.. మ‌రో 40 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి కొత్త‌దానిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ వృధా ఖ‌ర్చులు ఖ‌జానాకు చేటు తెస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే, తెలంగాణ లోటు బ‌డ్జెట్ దిశ‌గా అడుగులు వేయ‌డానికి ఉద్యోగులకు భారీ స్థాయిలో పెంచిన జీతాలు, పంట రుణాలు, చేనేత రుణాలు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, సామాజిక పెన్ష‌న్లు, బీపీఎల్ కోటా పెంచ‌డం వంటివి ప్ర‌ధాన కార‌ణాల‌ని కేంద్ర ఆడిట్ అధికారులు వెల్ల‌డిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. సంప‌న్న రాష్ట్రంగా అవ‌త‌రించిన తెలంగాణ చుట్టూ ఇప్పుడు స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయ‌న‌డంలో సందేహంలేదు. మ‌రి కేసీఆర్ వీటిని ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.