బాబుకు మ‌రో త‌ల‌నొప్పి త‌ప్ప‌దా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో త‌ల‌నొప్పి త‌ప్పేలా లేదు! కాపుల రిజ‌ర్వేష‌న్‌ రూపంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబును ఆయ‌న ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేసిన మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు తాజా గా మ‌రోసారి స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర రూపంలో ఉద్య‌మించేందుకు సిద్ధం అవుతున్నారు. కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామంటూ 2014 ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌కాలం పూర్త‌యిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు త‌న హామీని నెర‌వేర్చ‌లేద‌ని ఆరోపిస్తూ.. ముద్ర‌గ‌డ ఆరోపించ‌డమే కాకుండా గ‌త కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే.

తునిలో నిర్వ‌హించిన కాపుల స‌భ ఉద్రిక్త‌త‌ల‌కు, ఆందోళ‌న‌ల‌కు దారితీసింది. రైలు ద‌హ‌నాలు, పోలీస్ స్టేష‌న్ల‌కు నిప్పు వంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో హుటాహుటిన స్పందించిన చంద్ర‌బాబు కాపుల స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం కోసం మంజునాథ క‌మిటీని వేశారు. ఆ త‌ర్వాత కాపు విద్యార్థుల‌ను ఆదుకునేందుకు ఉదారంగా నిధులు విడుద‌ల చేశారు. అదేస‌మ‌యంలో ఫారిన్ వెళ్లి చ‌దువుకునేందుకు కూడా అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ఈ ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు తాత్కాలికంగానే మారాయి. మంజు నాథ క‌మిటీ రిపోర్టు రెండు నెల‌ల్లోనే అందుతుంద‌ని, అది అందిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు చెబుతూ వ‌చ్చారు.

అయితే, ఆ రెండు మాసాల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబు మాత్రం కాపు ఉద్య‌మం చ‌ల్లారిపోయింద‌ని, తాను అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌తో కాపు యువ‌త ఆందోళ‌న ల‌ను నుంచి బ‌య‌ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే, నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న కాపు ఉద్య‌మం మ‌రోసారి జ‌డ‌లు విచ్చుకునేందుకు రెడీ అయిపోయింది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో సినీ రంగంలోని కాపు ప్రముఖుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన మాజీ మంత్రి ముద్ర‌గ‌డ‌.. వారిని త‌న‌కు మ‌ద్ద‌తుగా మ‌లుచుకోవ‌డంలో పూర్తిగా స‌ఫ‌లీకృతం అయ్యారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే నెల 16 నుంచి ఐదు రోజుల పాటు మ‌లి ఉద్య‌మానికి రెడీ అవుతున్నారు.

దీనిని స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర‌గా పేర్కొంటున్న ముద్ర‌గ‌డ‌.. త‌న కాపు జాతి కోసం ఏమైనా చేసేందుకు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న పాద‌యాత్ర విష‌యంలో వెన‌క‌డుగు వేసేది లేద‌ని, త‌న‌తో ఒక్క‌రు వ‌చ్చినా, ప‌దిమంది క‌దిలినా ఈ యాత్ర జ‌రుగుతుంద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌నూ క‌లిపేదిగా ఉండాల‌ని ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌త్యాగ్ర‌హ పాద‌యాత్ర‌కు స‌మాయ‌త్త‌మైన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి తెప్పిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు విశ్లేష‌కులు! మ‌రి దీనిని ఏవిధంగా ఆయ‌న ఎదుర్కొంటారో వేచి చూడాలి.