కేసీఆర్ ఫ‌స్ట్ టార్గెట్ టీఆర్ఎస్ నేత‌లే

తెలంగాణ‌లో కొద్దిరోజ‌ల క్రితం పోలీసుల ఎన్‌కౌంట‌ర్లో హ‌త‌మైన న‌యీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అత‌డి అనుయాయుల అరాచ‌కాలు రోజుకొక‌టి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇత‌డికి సంబంధించిన కేసులు విచార‌ణ‌ను పోలీసులు మ‌రింత వేగ‌వంతం చేశారు.   తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచార‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.  గ్యాంగ్ స్టర్ నయీం అరాచ‌కాల‌కు స‌హ‌క‌రించిన వాళ్ల‌లో ప‌లువురు అధికారుల‌తోపాటు, రాజ‌కీయ నేత‌ల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు విన‌వ‌స్తున్నాయి.  నయీంతో సంబంధం ఉన్న వారిలో టీఆర్ ఎస్ నేతలు కూడా ఉన్నారని ప్రతిపక్షాలు గ‌ట్టిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. విప‌క్షాలకు ముక్కుతాడు వేసేందుకు… .ముందుగా  ఈ అంశంలో త‌మ పార్టీ నేతల సంగతే తేల్చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఆయ‌న ఆ దిశగా  కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అంటే సొంత పార్టీ నేత‌ల‌నే వ‌ద‌ల‌లేద‌నే మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి పంపాక.. ఇక న‌యీం ముఠాతో సంబంధ‌ముంద‌ని తేలిన విప‌క్ష నేత‌ల‌తో కేసీఆర్ ఒకాటాడుకుంటార‌న్న‌మాట‌.   ఈ క్రమంలో తాజాగా నయీం ముఖ్య అనుచరుల్లో ఒకరైన నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన టీఆర్ ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న‌గ‌రంలోని భాగ్ అంబర్ పేట లోని వైభవ్ నగర్ లో నివాసముంటున్న చింతల వెంకటేశ్వర్ రెడ్డి కొంతకాలం నుంచి బెంగుళూరులో ఉంటున్నట్టు స‌మాచారం. నయీం ఎన్ కౌంటర్ తరువాత వెంకటేశ్వర్ రెడ్డి హైద‌రాబాద్‌కు రాకుండా కర్ణాటకలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.  ప‌క్కా స‌మాచారంతో చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ అధికారులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

నయీంతో ఆర్థిక లావాదేవీలు, భూ దందాలు పెద్ద‌స్థాయిలోనే జ‌రిపిన‌ట్టు  చింతలపై ప‌లువురు బాధితుల‌నుంచి ఆరోపణలు రావడంతో సిట్ విచారణ జరిపింది. ఆయన నుంచి నయీంకు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్ రాబట్టిన‌ట్టు స‌మాచారం. చింతల భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన విష‌యం ఇక్క‌డ గ‌మ‌నార్హం. అనంత‌ర కాలంలో  ఆయ‌న‌ టీఆర్ ఎస్  పంచ‌న‌ చేరారు.

ఇప్పటి వరకు అరెస్టయిన వారిలో  అత్య‌ధికంగా నయీం అనుచరుల పేర్లతో దందాలు నిర్వ‌హించినవారే.. కాగా అతి త్వ‌ర‌లోనే గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీంకు స‌హ‌క‌రించిన‌ పోలీస్  ఉన్న‌తాధికారులు, రాజకీయ నాయకుల పేర్ల జాబితాను కూడా వెల్లడికానున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో న‌యీం కొమ్ముకాసిన ప‌లువురి గుండెల్లో ప్ర‌స్తుతం రైళ్లు ప‌రుడెతున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటిదాకా న‌యీం దందాల‌కు సంబ‌ధించి 155 కేసులు నమోదు కాగా …, ఇప్ప‌టికే  95 మందిని అరెస్టు చేశారు. 8మంది లొంగిపోయారు. ఇంకా 95 మందికి పిటీ వారెంట్లు జారీ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇంకా ఎంత‌మంది జాత‌కాలు ముందు ముందు బ‌య‌ట‌ప‌డ‌నున్నాయో వేచి చూడాల్సి ఉంది.