జూనియ‌ర్‌ని చంద్ర‌బాబు మ‌ళ్లీ చేర‌దీస్తున్నారా?

ఏపీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవ‌లం ఫ్యామిలీ ప‌రంగానే ప‌రిమితం కాలేదు. పొలిటిక‌ల్‌గా కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంది. నంద‌మూరి వంశంలో చంద్ర‌బాబుకు అండ‌గా నిల‌బ‌డిన వారిలో, చంద్ర‌బాబు చేర‌దీసిన వారిలో హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణల త‌రం త‌ర్వాత ఒక్క జూనియ‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తాడు. అదేవిధంగా జూనియ‌ర్‌కు ఓ మంచి సంబంధం చూసి, ద‌గ్గ‌రుండి వివాహం చేయించిన ఘ‌న‌త అక్ష‌రాలా చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని వ‌రుస‌కు త‌న‌కు మ‌న‌వ‌రాలు అయ్యే అమ్మాయిని ఏరికోరి చంద్ర‌బాబే జూనియ‌ర్‌కి ఇచ్చి వివాహం చేయించార‌ని అప్ప‌ట్లో వ‌చ్చిన వార్త. మ‌రి అలాంటి జూనియ‌ర్‌, చంద్ర‌బాబు ల మ‌ధ్య ఒక్క ఫ్యామిలీగానే కాకుండా పొలిటిక‌ల్‌గా కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.

వాస్తవానికి నంద‌మూరి వంశం నుంచి తెరంగేట్రం చేసిన బాల‌య్య త‌ర్వాత సీనియ‌ర్ ఎన్టీఆర్ ఇమేజ్ అంత‌టి పేరును ఒక్క తార‌క్ మాత్రమే సంపాదించాయి. త‌న అభిన‌యం, డైలాగ్ డెలివ‌రీ వంటివి సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌ని పోలివుండ‌డంతో తెలుగు ఆడియ‌న్స్ తార‌క్‌ని ఓన్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు పొలిటిక‌ల్‌గా ప‌నివ‌స్తాడ‌ని భావించిన చంద్ర‌బాబు.. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో జూనియ‌ర్‌తో ఎన్నిక‌ల ప్ర‌చారం చేయించారు. అప్ప‌టి వైఎస్ ప్ర‌భావాన్ని త‌ట్టుకోవాలంటే జూనియ‌ర్ క‌రెక్ట‌ని భావించారు. దీంతో చంద్ర‌బాబు మాట‌కు అక్ష‌రాలా క‌ట్టుబ‌డిన జూనియ‌ర్ డిటో సీనియ‌ర్ ఎన్‌టీఆర్ మాదిరిగా ఖాకీ డ్ర‌స్‌లో పొలిటిక‌ల్ ప్ర‌చారంలో పాల్గొని డైలాగుల‌తో ఇర‌గ‌దీశాడు.

కానీ, అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో అప్ప‌ట్లో వైఎస్ తిరిగి అధికారంలోకి వ‌చ్చారు. ఓ ర‌కంగా ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జూనియ‌ర్ గెలిచినా..  ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, ఆ త‌ర్వాత జూనియ‌ర్ త‌న మూవీ షూటింగుల్లో బిజీ అయిపోయాడు. విప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు త‌న‌కుతాను బిజీ అయ్యారు. ఆ త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల నాటికి ఏపీ పొలిటిక‌ల్ ముఖ చిత్రం స‌మూలంగా మారిపోయింది. రాష్ట్ర‌మే విభ‌జ‌న అయిపోయింది. దీంతో పొలిటిక‌ల్‌గా చంద్ర‌బాబు వ్యూహం ప‌టిష్టంగా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. దీంతో ఆయ‌న అటు బీజేపీతో జ‌ట్టుక‌ట్టి.. అదేస‌మ‌యంలో పార్టీని స్థాపించిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో మాట క‌ల‌పాల్సి వ‌చ్చింది.

ఆయ‌న‌ను ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చి టీడీపీకి బ‌లం చేకూరేలా చంద్ర‌బాబు ప‌క్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఏపీలో అధికారంలోకి వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు 2019 ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ఏ పొలిటిక‌ల్ పార్టీకైనా ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మార్చుకోవ‌డం, ప్ర‌జల మైండ్ సెట్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవ‌డం త‌ప్ప‌దు. ఇప్పుడు చంద్ర‌బాబు అదే వ్యూహాన్ని అనుస‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌న‌సేనాని 2019లో స్వ‌తంత్రంగా ఎన్నిక‌ల్లోకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌డంతో చంద్ర‌బాబుకు మ‌రో ప్ర‌త్యామ్నాయం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

దీంతో ఆయ‌న జూనియ‌ర్‌ను తిరిగి ఆహ్వాంచే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికితోడు తాను ఇప్ప‌ట్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాన‌ని, కేవ‌లం తాత‌గారు స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాన‌ని జూనియ‌ర్ ఎప్పుడో ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు తార‌క్ ను తిరిగి ఎన్నిక‌ల ప్ర‌చారానికిఆహ్వానించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. ఏదేమైనా తిరిగి మేన‌ల్లుడు, మామ‌ల పొలిటిక్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలంటే 2019 వ‌ర‌కు వేచి చూడాలి.