ఆవిడ‌.. అమ్మ లోటు తీరుస్తోందా?

అమ్మ లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేర‌ని అంటారు! ఇది క‌న్న‌త‌ల్లి విష‌యంలో! కానీ, త‌మిళ‌నాడులో మాత్రం అక్క‌డి జ‌నాల‌కి క‌న్న‌త‌ల్లి క‌న్నా పాలిస్తున్న త‌ల్లి, పురుచ్చిత‌లైవి అయిన జ‌య ల‌లిత అంటే పంచ ప్రాణాలు. అమ్మ క‌నుస‌గైలే ఆదేశాలు, అమ్మ పలుకులే ఆణిముత్యాలు! అమ్మ కోసం ఏమైనా చేస్తాం అనేవారు స్టేట్‌లో స‌గానికిపైగా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అమ్మ కోసం గుడులు, అమ్మ‌కోసం పూజ‌లు, అంతెందుకు అమ్మ‌కే పూజ‌లు! త‌మిళ‌నాట అమ్మంటే జ‌యే!! అందుకే స్టేట్ పొలిటిక‌ల్ సెంటిమెంట్‌ను సైతం ప‌క్క‌కు పెట్టి.. రెండో సారి అమ్మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది త‌మిళ‌నాడు. మ‌రి అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు అమ్మ‌కు జ‌బ్బు చేసింది. గ‌డిచిన ప‌ది రోజుల‌కు పైగా ఆస్ప‌త్రికే ప‌రిమిత‌మైంది. ఈ స‌మ‌యంలో.. త‌మిళ‌నాడు ప‌రిస్థితి ఏంటి? ఆ అమ్మ లేని లోటు ఎవ‌రు తీరుస్తారు? క‌ష్ట‌మే అనుకున్నారు అంద‌రూ.

కానీ, ఆ అమ్మే నియ‌మించిన మ‌రో మ‌హిళ‌.. ఇప్పుడు అమ్మ‌గా మారి త‌మిళ‌నాడు పాల‌న‌ను చూస్తున్నారు. దాదాపు అమ్మ‌ను మ‌రిపించేంతగా ఆమె పాల‌న‌లో దూసుకుపోతున్నార‌ని మీడియా వెల్ల‌డిస్తోంది. వాస్త‌వానికి అన్నాడీఎంకేలో జ‌య త‌ర్వాత సెకండ్ ప్లేస్ ఎవ‌రు అంటే ప‌న్నీరు సెల్వం పేరు తెర‌మీద‌కి వ‌స్తుంది. అక్ర‌మాస్తుల కేసులో జ‌య జైలుకు వెళ్లిన‌ప్పుడు సెల్వం సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు కూడా. ఇక‌, ఇప్పుడు అమ్మ ఆస్ప‌త్రి పాల‌య్యాక ఆయ‌నే తెర‌మీద‌కి వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల జ‌య ఆయ‌న‌ను గ‌తంలోనే కిందికి నెట్టారు. త‌న‌కు స‌ల‌హాదారుగా మాజీ ఐఏఎస్ మ‌హిళా అధికారి, కేర‌ళ‌కు చెందిన  షీలా బాలకృష్ణన్‌ను నియ‌మించుకున్నారు.

దాదాపు పాల‌న వ్య‌వ‌హారాల్లో మంచి చెడ్డ‌ల‌ను షీలానే జ‌య‌కు తెర వెనుక అందిస్తూ వ‌చ్చారు. 2014లో షీలా రిటైరైన నాలుగో రోజునే జ‌య ఆమెను త‌న స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారంటే షీలా ప్ర‌భావం, ఆమె చురుకుత‌నం, పాల‌నా వ్య‌వ‌హారాల్లో ప‌ట్టు వంటి అంశాల‌పై జ‌య ఎంత‌గా ఇన్‌స్పైర్ అయ్యారో తెలుస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు షీలానే జ‌య త‌ర్వాత జ‌య‌గా త‌మిళ‌నాడులో పాల‌న‌ను నిరాఘాటంగా సాగిస్తున్నారట‌! పార్టీలో నెంబ‌ర్ టూ, త్రీలు స‌హా జ‌య‌కు అత్యంత స‌న్నిహితురాలు శ‌శిక‌ళ కూడా షీలా నుంచే స‌ల‌హాలు స్వీక‌రిస్తున్న‌రాట‌.

అంతేకాకుండా ఆమె చెప్పినట్టే న‌డుచుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం జ‌య చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్నారు. ఆమె గ‌దికి ప‌క్క‌నే మ‌రో గ‌దిలో ఉంటున్న షీలా.. ఒకే స‌మ‌యంలో ఇటు జ‌య ఆరోగ్యాన్ని, అటు త‌మిళ‌నాడు పాల‌న‌ను చ‌క్క‌బెడుతున్న‌ట్టు తెలుస్తోంది. మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వంటి వారు సైతం షీలా చెప్పిన సల‌హాల మేర‌కు రాష్ట్రంలో పాల‌న ఆగిపోకుండా చూస్తున్నారట‌. జ‌య ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి.. పూర్తిస్థాయిలో పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టే వ‌ర‌కు త‌మిళ‌నాడులో షీలానే మ‌రో అమ్మ‌ని అంటున్నారు అన్నాడీఎంకే వ‌ర్గాలు.