ఏపీలో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే విన్న‌ర్ ఎవ‌రు..!

రాష్ట్రం ఆర్థికంగా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో అధికారం చేప‌ట్టినా… త‌న స‌మ‌ర్థ‌త‌, సుదీర్ఘ రాజ‌కీయ, పాల‌నానుభ‌వం, స‌మ‌యానుకూల‌ వ్యూహాలే పెట్టుబ‌డిగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర ప‌రిస్థితిని ఓ ర‌కంగా గాడిలో పెట్ట‌గ‌లిగార‌నే చెప్పాలి.  అయితే తాను రాత్రిప‌గ‌లు తేడా లేకుండా కుటుంబాన్ని కూడా మ‌ర‌చిపోయి.. రాష్ట్రం కోసం శ్ర‌మిస్తున్నా.. అందుకు త‌గిన స్థాయిలో టీడీపీ ప్ర‌భుత్వానికి మైలేజీ రావ‌డం లేద‌ని చంద్ర‌బాబు పార్టీ అంత‌ర్గత చ‌ర్చ‌ల్లో వాపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.. దానికితోడు  ముఖ్య‌మంత్రి కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి..ఇటీవ‌ల‌ స్వ‌యంగా జ‌రిపించిన స‌ర్వేలో… ఏపీలో టీడీపీ ప‌ట్ల జ‌నాద‌ర‌ణ త‌గ్గింద‌ని, విప‌క్షానికి ఆద‌ర‌ణ పెరిగింద‌ని తేలిన‌ట్టు వార్త‌లు రావ‌డంతో.. వాటిలో నిజ‌మెంతో తెలియ‌దు కాని అవి టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కుల్లో ఆందోళ‌న నింపాయ‌న్న‌ది మాత్రం నిజం. అయితే ఆ స‌ర్వే జ‌ర‌గ‌నే లేద‌ని ఇదంతా.. వైసీపీ దుష్ప్ర‌చార‌మేన‌ని టీడీపీ వ‌ర్గాలు ఖండిస్తూ వ‌చ్చాయి.

అయితే చంద్ర‌బాబుతో పాటు పార్టీ క్యాడ‌ర్‌కు కూడా ఉత్సాహం క‌లిగించే విష‌యాన్ని తాజాగా ఓ స్వ‌తంత్ర స‌ర్వే సంస్థ బ‌య‌టపెట్టింది.  ఇప్ప‌టికిప్పుడు పార్లమెంట్ స్థానాల‌కు ఎన్నిక‌లు జరిగితే ఏపీలో అధికార టీడీపీ మళ్లీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించ‌డం ఖాయ‌మ‌ని ఆ సంస్థ నిర్వ‌హించిన  సర్వే తేల్చి చెప్పింది. ‘వీడీపీ అసోసియేట్స్‌ అనే సంస్థ నిర్ధిష్ట కాలానికి వివిధ రాష్ట్రాల్లో సర్వేలు నిర్వ‌హిస్తూ ప్రభుత్వాల‌ పనితీరుపై ప్ర‌జాభిప్రాయం ఎలా ఉందో చెబుతూ ఉంటుంది. ఇటీవ‌ల‌ ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 420 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

ఈ స‌ర్వే తేల్చిన‌ ఫ‌లితాల ప్ర‌కారం… ఏపీలో పార్ల‌మెంటు స్థానాల‌కు ఇప్ప‌కిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అధికార టీడీపీ ఆధిక్యాన్ని నిలుపుకోగ‌లుగుతుంది. అయితే గ‌తంలో గెలిచిన 17 పార్ల‌మెంటు స్థానాల్లో రెండు సీట్లు కోల్పోయి.. ఆ పార్టీ 15 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.  ఆ రెండు సీట్లు విప‌క్ష‌మైన వైసీపీ ఖాతాలోకే వెళతాయని ఆ స‌ర్వే తేల్చింది. అంటే టీడీపీ, బీజేపీ కూట‌మికి 15 సీట్లు, విప‌క్ష వైసీపీకి 10 సీట్లు రావ‌చ్చ‌న్న‌మాట‌.

ఇక  ప్రభుత్వాలపనితీరు, ప్ర‌జాద‌ర‌ణ‌, పథకాల అమలు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రులకు ర్యాంక్‌లను సైతం ఈ స‌ర్వే కేటాయించింది. ఈ ర్యాంకుల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (87శాతం) జనాదరణతో దేశంలో మొదటి స్థానంలోకి దూసుకుపోయిన‌ట్టు తేలింది. ఆ త‌రువాత స్థానంలో 86శాతంతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ఉండ‌గా, 79శాతంతో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి ‘మమతాబెనర్జీ’ మూడవ స్థానంలోనూ, 75శాతం ప్ర‌జాద‌ర‌ణ‌తో తమిళనాడు ముఖ్యమంత్రి ‘జయలలిత 4వ స్థానం, 62శాతం జనాదరణతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్రపణ్నిస్  ఐదో స్థానంలోనూ నిలిచార‌ని తేలింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 58 శాతం ప్ర‌జాద‌ర‌ణ‌తో ఈ జాబితాలో ఏడో స్థానం లభించిందట. గతంలో ఆయనకు ఇదే సంస్థ 4వ స్థానం ఇచ్చిన విష‌యం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ కూటమికి 45% ఓటింగ్‌ వస్తుందని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ 39% ఓటింగ్ వచ్చే అవ‌కాశ‌ముంద‌ని ఈ స‌ర్వే చెప్పింది. అంటే ఇద్దరికి మధ్య 6శాతం ఓటింగ్‌ తేడా ఉంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్కశాతం ఓటింగ్‌తో అధికారాన్ని కైవసం చేసుకున్నటీడీపీ ఇప్పుడు ప్రతిపక్షం కన్నా ఆరు శాతం ఓట్లు ఎక్కువగా సాధిస్తుందంటే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూట‌మికి ఘ‌న‌విజ‌యం ఖాయ‌మైన‌ట్టేన‌ని చెప్పాలి. అయితే ఇవ‌న్నీ ప్ర‌స్తుత ప‌రిస్థితులు బ‌ట్టి వ‌చ్చిన ఫ‌లితాలు మాత్ర‌మే.. ఇవి భారీగా మారేందుకు అవ‌కాశమూ లేక‌పోలేదు.

ఇక ఈ స‌ర్వేలో తేలిన మ‌రో ముఖ్య‌విష‌యం ఏమిటంటే దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధానిగా మోడీకి అత్య‌ధిక మ‌ద్ధ‌తు ల‌భించ‌గా.., ఏపీలో మాత్రం ఆయ‌నపై ఆ స్థాయి అనుకూల‌త క‌నిపించ‌లేదు. ఏపీకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ‌డంలో ప్ర‌ధాని నిర్ల‌క్ష్యం చూపించార‌ని ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌ర్వేలో స్ప‌ష్టంగా తేలింది. ఒక‌ర‌కంగా బీజేపీ ఉన్న ఆగ్ర‌హం ఇక్క‌డ టీడీపీపైనా ప్ర‌తిఫ‌లిస్తుంద‌ని చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే టీడీపీ కూట‌మికి మ‌రింత సానుకూల ఫ‌లితం ల‌భించి ఉండేద‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి.