టీడీపీలో టాప్ ఎమ్మెల్యేల‌కు లీస్ట్ ర్యాంకులా..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వ‌రుస‌గా ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయిస్తున్నారు. ఈ స‌ర్వేల వివ‌రాల ఆధారంగా ర్యాంకులు ప్ర‌క‌టించ‌డంతో వారు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అలెర్ట్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది. ఏ మాత్రం తేడా కొట్టినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు గారు టిక్కెట్టు ఇస్తారా ? ఇవ్వ‌రా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉండ‌డంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా త‌మ శాఖ‌ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉత్త‌మ పనితీరు మెరుగు ప‌ర‌చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇదిలా ఉంటే చంద్ర‌బాబు సీఎం అయ్యి రెండున్న‌రేళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ప‌నితీరుపై తాజాగా ఓ స‌ర్వే చేయించారు. ఈ స‌ర్వేల వివ‌రాల ఆధారంగా వారికి గ్రేడింగులు ఇచ్చి ఆ వివ‌రాలు ఓ సీల్డు క‌వ‌ర్లో పెట్టి మ‌రీ వారికి ఇచ్చారు. ఈ స‌ర్వేల్లో ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది ?  వారు ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మైక్య‌మ‌వుతున్నారు ?  బంధు ప్రీతి ?  సెటిల్‌మెంట్లు, వారి అనుకూల‌త‌లు – ప్ర‌తికూల‌తలు అన్ని వారికి ఇచ్చిన నివేదిక‌లో ఉన్నాయి.

వారి ప‌నితీరు ఆధారంగా నేత‌ల‌కు ఏ, బీ, సీ, డీ గ్రేడ్ల‌ను కేటాయించారు. అయితే ఈ గ్రేడ్ల వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా చంద్ర‌బాబు వారికి సీరియ‌స్‌గా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అవి ఎలాగోలా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ప‌నితీరు ప‌రంగా జిల్లాలో టాప్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొంద‌రికి స‌ర్వేలో వ్య‌తిరేక నివేదిక‌లు రావ‌డం వారితో పాటు మిగిలిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను సైతం ఖంగుతినిపించింది.

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే.. గ‌ద్దె రామ్మోహ‌న్‌ టీడీపీలో సీనియ‌ర్ నేత‌. గ‌తంలో ఎంపీగా కూడా గెలుపొందారు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి రోజు కాలికి బ‌లపం క‌ట్టుకుని మ‌రీ తిరుగుతారు. అయితే ఆయ‌న‌కు చాలా అంశాలు నివేదిక‌లో వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. అయితే ఆ స‌ర్వేలో చాలా లోపాలున్నాయి. రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ జడ్పీటీసీ చైర్ పర్సన్‌గా ఉన్నప్పటికీ జడ్పీ నుంచి నిధులు తీసుకురావటం లేదంటూ సర్వేలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్ నిధులు గ్రామాలకే గాని, నగరాలకు ఇవ్వరు. ఈ విష‌యం తెలియ‌క స‌ర్వేలో రాంగ్ రిపోర్టు ఇచ్చారు.

ఇక అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉన్నం హ‌న్మంత‌రాయ చౌద‌రికి జిల్లాలో చాలా పేరు ఉంది. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న 10 సంవ‌త్స‌రాలు ఆయ‌న పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. ఆయ‌న వ‌ద్ద‌కు ఎవ్వ‌రు వెళ్లినా వెంట‌నే ప‌ని అయ్యేలా ఫాలో అప్ చేస్తార‌న్న పేరు ఉంది. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న వివాద ర‌హితుడు. అయితే స‌ర్వేలో ఆయ‌న‌పై కూడా నెగిటివ్ రిపోర్టు రావ‌డంతో పార్టీ వ‌ర్గాలు సైతం ఇది రాంగ్ సర్వే అని అంటున్నారు.

అయితే త‌మ ప్ర‌మేయం లేని అంశాల‌పై కూడా త‌మ‌కు వ్య‌తిరేకంగా నివేదిక‌లు రావ‌డంతో కొంద‌రు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును క‌లిసి ఇవి త‌ప్పు అని విన్న‌వించుకున్నార‌ట‌.అయితే చంద్ర‌బాబు కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను అందుబాటులో ఉండ‌డం లేద‌ని..అందువ‌ల్ల అక్క‌డ కూడా త‌న‌కు ఈ విష‌యంలో నెగిటివ్ మార్కులే వ‌చ్చాయ‌ని..వీటిని ప‌ట్టించుకోకుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని వారికి స‌ర్ది చెప్పి పంపిస్తున్నార‌ట‌.