లైవ్‌షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

వైకాపా అధినేత జ‌గ‌న్ గురించి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు నేత‌లు చేసిన ప్ర‌చారాన్ని బ‌ట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోడ‌నీ, త‌న‌మాటే నెగ్గాల‌నే మొండి ప‌ట్టుద‌ల గ‌ల వ్య‌క్తి అని అనుకుంటారు అంద‌రూ. అదేవిధంగా త‌న‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండ‌ద‌ని, త‌న కింద ప‌నిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వ‌ర‌ని క‌ర్రీలో క‌రేపాకులా తీసి పారేస్తూ ఉంటార‌ని కూడా జ‌గ‌న్ గురించి వారు విప‌రీత ప్ర‌చారం చేశారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ యాట్టిట్యూడ్‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అయితే, ఆదివారం ఆయ‌న సొంత టీవీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరును చూశాక‌.. విమ‌ర్శ‌కులు సైత‌.. జ‌గ‌న్ ఇంత పాజిటివా? అని అన‌కుండా ఉండ‌లేక‌పోయారు!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. సాక్షి టీవీలో లైవ్ ప్రోగ్రాంని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఇదే అనుకున్నారంట‌. దాదాపు మూడు గంట‌ల‌పాటు సాగిన ఎన్నారై తెలుగు వాళ్ల‌తో ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ నేరుగా పాల్గొన్నారు. సాధార‌ణంగా ఆయ‌న ఎలాంటి ఇంట‌ర్వ్యూల‌కు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. కానీ, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా అంద‌రినీ కూడ‌గ‌డుతున్న జ‌గ‌న్‌.. ఆదివారం లైవ్ షోకి రెడీ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావు(కేఎస్ ఆర్‌) వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అంటే.. జ‌గ‌న్ సంస్థ సాక్షిలో కొమ్మినేని ఓ ఉద్యోగి! అయితే, త‌న ఇంట‌ర్వ్యూ ఆసాంతం ఎక్క‌డా జ‌గ‌న్.. కొమ్మినేనిని ఆ దృష్టితో చూసిందేలేదు. పైపెచ్చు కొమ్మినేనిని అన్నా అని సంబోధించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

కార్యక్రమంలో ఒకసారి టేబుల్‌ మీద ఉన్న కాగితాలు కిందపడిపోయాయి. ఆ సమయంలో జగన్‌ కిందకు ఒంగి వాటిని తీయబోయారు. ”వద్దు వద్దు” అంటూ జగన్‌ చేతిని కొమ్మినేని పట్టుకుని వారించారు. అయితే జగన్‌ పర్వాలేదంటూ కిందకు ఒంగి కాగితాలను తీసి కొమ్మినేనికి అందించారు. కొమ్మినేనిని ఒక ఉద్యోగిలా కాకుండా ఆయన వయసును, అనుభవాన్ని జగన్‌ గౌరవించిన విధానం కూడా బాగానే ఉంది. కార్యక్రమానికి విదేశాల నుంచి లైవ్‌లో హాజరైన వారిని కూడా వారివారి పేర్లతో పలకరించి జగన్ సమాధానాలు చెప్పిన విధానం ఆడియ‌న్స్‌ని ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసింది. మొత్తంగా కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ ఎంతో ఓర్పుగా గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. గ‌తంలో ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం వంటివి గ‌మ‌నిస్తే… ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? అన్న డౌట్ వ‌స్తోంది. ఏదేమైనా.. జ‌గ‌న్ నిజంగా ఇంత పాజిటివా? అనే యాంగిల్‌లో కార్య‌క్ర‌మాన్ని ర‌క్తి క‌ట్టించారు.