మాజీ మంత్రిపై ద‌య వెన‌క మ‌ర్మ‌మేమిటో

నేటి రాజ‌కీయాల్లో అధికార పార్టీలు విప‌క్షంలో ఉన్న‌వారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న ప‌వ‌ర్‌ను వినియోగించుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌టం ద్వారా వారిని లొంగ‌దీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యంలో ఏ పార్టీకి, ఏనాయ‌కుడికి మిన‌హాయింపు లేద‌నే చెప్పాలి. సాధార‌ణంగా త‌మిళ‌నాట ఈ సంస్కృతి ఎక్కువ‌గా క‌నిపించేది. అయితే వైఎస్ హ‌యాంలో రాష్ట్రంలోనూ ఈ ధోర‌ణి ప‌తాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మూ దానినే అనుస‌రిస్తోంది. అయితే మేం అలాంటి విధానాల‌కు వ్య‌తిరేక‌మ‌ని వారు చెప్పుకోవ‌డమే వింత‌గా క‌నిపిస్తోంది మ‌రి.

తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మాట‌లు చూస్తే ఎవ‌రైనా బుర్ర‌గోక్కోవాల్సిందే.. చంద్ర‌బాబు త‌ల‌చుకుని ఉంటే ఈ పాటికి వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జైల్లో ఉండేవాడ‌ని సెల‌విచ్చారీ త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కుడు. చంద్రబాబు శాంతి దూత లాంటి వాడు కాబట్టే లిక్కర్‌ సిండికేట్‌, ఇసుక మాఫియా, వోక్స్‌వ్యాగన్‌ కేసుల్లో బొత్సను వదిలిపెట్టారట‌.. కక్షసాధింపు ఎందుకన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చేశారని, మ‌రి అంత ఉదారంగా వ‌దిలేసిన‌ చంద్రబాబును పట్టుకుని బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం ఏమిటని కూడా ప్ర‌శ్నించారు నాయుడుగారు. అంతే కాదు.. వైఎస్ ఆత్మ కేవీపీకి వైఎస్ అధికారంలోకి రాక‌ముందు కొడుక్కి కాలేజీ ఫీజు క‌ట్ట‌డానికి కూడా ఠికానా లేద‌ని ఇప్పుడు వేల కోట్లు ఎక్క‌డినుంచి వ‌చ్చాయ‌ని కూడా నిల‌దీశారు.

ఇదంతా బాగానే ఉందికాని… తాను నిప్పున‌ని త‌ర‌చూ చెప్పుకునే చంద్ర‌బాబు మ‌రి అలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌వారిని శిక్షిస్తార‌నే క‌దా.. ఆయ‌న‌ను న‌మ్మి చాలామంది ఓట్లేసింది… మ‌రి ఇలా వ‌దిలేయ‌డం వెనుక మ‌త‌ల‌బు కూడా ఆయ‌నే చెప్పి ఉంటే బాగుండేది.. ముద్దు చెప్పినట్టు ముఖ్య‌మంత్రి గౌత‌మ బుద్ధుడు, కక్ష సాధింపు వద్దు అనుకునే వ్యక్తే అయితే మ‌రి బొత్సను మాత్ర‌మే ఎందుకు వ‌దిలేసినట్టో.. విప‌క్ష‌ నేతలను వెంటపడి కేసులు పెట్టి వ‌రుస‌గా జైలుకెందుకు పంపుతున్నారో కూడా ముద్దుకృష్ణ‌మే చెప్పాలి మ‌రి..! బాబు సీఎం అయిన తర్వాత చెవిరెడ్డి ఇప్పటికే మూడునాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. రోజాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వెంబడించారు. డీఎస్పీని డోన్ట్ టచ్‌ మీ అన్నందుకే పార్టీ ఫిరాయించక ముందు భూమానాగిరెడ్డిని జైలుకు పంప‌డం, లేటెస్ట్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని తుని ఘ‌ట‌న‌కు సంబంధించి పదేపదే సీఐడీ విచారణ పేరుతో ఆటాడుకోవ‌డాన్ని ఏమంటారో కూడా ఆయ‌నే చెపితే బాగుంటుంది..!