కెసిఆర్ కి సహకరించారు మరి జగన్ కి ?

గ‌తంలో ఒక‌ద‌శ‌లో తెలంగాణ ఉద్యమం… నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైపోయిన ద‌శ‌లో… కేసీఆర్ ఉద్య‌మానికి స‌జీవంగా ఉంచేందుకు ఆలోచ‌న కంటే ఆవేశం ఎక్కువ‌గా ఉండే యువ‌త‌ను న‌మ్ముకున్నారు. తెలంగాణ‌లోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో విద్యార్థుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించి వారిలో విభ‌జ‌న ఉద్య‌మ జ్వాల‌లు ర‌గిలించారు. వారితో పాటు ప్ర‌జా సంఘాలు, ఉద్యోగ సంఘాల‌ సాయంతో ఉద్య‌మాన్ని మ‌లి ద‌శ‌కు తీసుకెళ్లి అంతిమంగా ల‌క్ష్యం సాధించ‌గ‌లిగారు.

తాజ‌గా జ‌గ‌న్ కూడా ప్ర‌త్యేక హోదా అంశంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తెచ్చేందుకు యువత‌నే న‌మ్ముకోవ‌డం మేల‌ని ఫిక్స్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది.. ప్ర‌త్యేక హోదా తోనే ఉద్యోగాలు వ‌స్తాయని, లేక‌పోతే యువ‌త‌కు అధోగ‌తేన‌ని ఆయ‌న ఏలూరులో యువ‌భేరి స‌భ పెట్టి మ‌రీ మోత మోగించారు. ఈ స‌భ త‌ర్వాత మ‌రిన్ని స‌భ‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

అయితే కేసీఆర్ ఉద్య‌మ కాలంలో మీడియాను కూడా స‌మ‌యానుకూలంగా గొప్ప‌గా వినియోగించుకున్నారు. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటు ఉంది కాబ‌ట్టి.. ఆయ‌న ఎక్క‌డ ఆంద్రా ముద్ర వేస్తారోన‌నే భ‌యంతో ఆయ‌న ఏం మాట్లాడినా ప్ర‌చారంలో మీడియా సంస్థ‌లు పోటీ ప‌డేవి. ఇప్పుడు అవే చానెల్స్ జగన్ విషయం లో మాత్రం బిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

సొంత మీడియాలో తప్ప మిగిలిన న్యూస్ చానెల్స్ లో ఆయన చేపట్టే కార్య క్రమాలకు అంత ప్రాధాన్యం కనిపించదు. అయితే ఇక్కడ జగన్ కూడా మిగిలిన చానెల్స్ ని రాజకీయ ప్రత్యర్థులుగా భావించకుండా వాటిలో కూడా ఇంటర్వూస్ ఇవ్వటానికి ఆసక్తి చూపిస్తే ఆయ‌న రాజ‌కీయ వ్యూహాలు ఫలించే అవ‌కాశం లేక‌పోలేదు..