మెగా ఫ్యామిలీ రికార్డును బ్రేక్ చేసిన ఎన్టీఆర్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్ సినిమా వ‌సూళ్ల వ‌ర్షం ఇంకా ఆగ‌లేదు. ఈ నెల 1వ తేదీన బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ త‌న దూకుడు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. జ‌న‌తా గ్యారేజ్ డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. గ్యారేజ్ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇంకా చాలా చోట్ల వ‌సూళ్ల ప‌రంగా స్టడీగానే కొన‌సాగుతోంది.

ఇదిలా ఉంటే గ్యారేజ్ దెబ్బ‌కు టాలీవుడ్‌లో 15 సంవ‌త్స‌రాలుగా మెగా ఫ్యామిలీ పేరిట ఉంటూ చెక్కు చెద‌ర‌కుండా వ‌స్తోన్న ఓ రికార్డు బ‌ద్ద‌లైంది. టాలీవుడ్‌లో రికార్డుల హంగామా అనేది స‌మ‌ర‌సింహారెడ్డి సినిమా నుంచి బాగా స్టార్ట్ అయ్యింది. 2001లో వ‌చ్చిన న‌ర‌సింహ‌నాయుడు సినిమా త‌ర్వాత టాలీవుడ్ టాప్‌-3 గ్రాస్ సినిమాల‌లో స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, త‌రుణ్ నువ్వేకావాలి సినిమాలు ఉండేవి.

అయితే 2001లో ఖుషీ సినిమాతో ప‌వ‌న్ టాలీవుడ్ టాప్‌-3 గ్రాస్ మూవీస్ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో చిరు ఇంద్ర సినిమాతో టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. అప్పటికి అదే అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. 2009లో చిరు త‌న‌యుడు మ‌గ‌ధీర సినిమాతో టాప్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు. త‌ర్వాత 2013లో ప‌వ‌న్ అత్తారింటికి దారేది సినిమాతో టాప్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు.

ఇక ఇంద్ర నుంచి చూస్తే అత్తారింటికి దారేది వ‌ర‌కు మెగా ఫ్యామిలీదే టాప్ ప్లేస్‌. అయితే రాజ‌మౌళి బాహుబ‌లి దెబ్బ‌తో మెగా ఫ్యామిలీ టాప్ ప్లేస్‌కు గండి ప‌డింది. అయినా వారు టాప్‌-3 ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నారు. బాహుబ‌లి-శ్రీమంతుడు త‌ర్వాత అత్తారింటికి దారేది నిన్న‌టి వ‌ర‌కు టాప్‌-3 ప్లేస్‌లో ఉంటూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ గ్యారేజ్ అత్తారింటికి దారేది రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డంతో పాటు టాప్‌-3 ప్లేస్‌లోకి వ‌చ్చేసింది. దీంతో 15 సంవ‌త్స‌రాలుగా టాలీవుడ్ టాప్ -3 గ్రాస‌ర్ల జాబితాలో ఏదో ఒక మెగా హీరో సినిమా ఉంటుండ‌గా ఇప్పుడు ఎన్టీఆర్ దెబ్బ‌కు ఆ రికార్డు మరుగున ప‌డిపోయింది.