ప‌వ‌న్‌కు వారిద్ద‌రి క్లాస్ వ‌ర్క్ అవుట్ అవుతుందా..!

ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యం ఇంకా ప్ర‌జ‌ల్లోకి అంత‌గా వెళ్ల‌లేదు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, ఆయ‌న‌ను ఆరాధించే ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల్లోకి ప్యాకేజీ అస్స‌లు వెళ్ల‌లేదు. దీంతో ఇప్పుడు స్టేట్ టీడీపీ స‌హా నేష‌న‌ల్ బీజేపీల‌కు ఇది పెద్ద ప్రాబ్లంగా ప‌రిణ‌మించింది. 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చినా.. ఇప్పుడు విధిలేని ప‌రిస్థితిలోనే ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని కేంద్రం చెబుతోంది. అంతేకాదు, హోదాతో ఏమేమి ఈ స్టేట్‌కి వ‌స్తాయో.. అంత‌క‌న్నా ఎక్కువ‌గా.. హోదాను మించిన ప్యాకేజీని ఏపీకి ఇచ్చామ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య ప‌దేప‌దే మీడియా గొట్టాల ముందు ఘొల్లుమంటున్నారు. మ‌రోప‌క్క‌, బీజేపీతో జ‌త క‌ట్టి ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. తొలుత ఏపీకి అన్యాయం జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోన‌ని అన్నారు.

రాజ్య‌స‌భ‌లో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ.. నీతిఆయోగ్ చెప్పిన దానిని బ‌ట్టి ఏపీకి హోదా ఇవ్వ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని ప్ర‌క‌టించిన స‌మ‌యంలో త‌న ర‌క్తం మ‌రిగిపోతోందంటూ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇక‌, ఏమైందో ఏమో.. కేంద్రం ఇచ్చిన‌దానిని అది ప్యాకేజీ రూపంలో ఉందా లేక హోదా రూపంలో ఉందా అన్న‌ది కాకుండా ఇచ్చింది ముందు తీసుకుని త‌ర్వాత అడుగుదామ‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం ప్యాకేజీ స్టేట్‌మెంట్ ఇవ్వ‌గానే విజ‌య‌వాడ‌లో రెడ్ కార్పెట్ వేసి మ‌రీ వెల్‌కం చెప్పారు చంద్ర‌బాబు. అంతేకాదు, ప్యాకేజీపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం ద్వారా స‌మ‌స్య‌ప‌రిష్కారం సాధించాల‌ని బాబు ప్లాన్ చేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అటు టీడీపీ, ఇటు బీజేపీ నేత‌లు ఓకే అయిపోయారు.

కానీ… ఇక్క‌డే పెద్ద చిక్కు వ‌చ్చిపడింది. 2014 ఎన్నిక‌ల్లో.. ఏపీలో టీడీపీ, బీజేపీల‌కు పెద్ద ఎత్తున ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం చేసి పెట్టారు. తాను జ‌న‌సేన పార్టీని స్థాపించి కూడా ఎక్క‌డా పోటీకి దిగ‌కుండా సైకిల్‌, క‌మ‌లాల‌కే ఓటేయాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిసిందే. దీంతో ప‌వ‌న్ ఇప్పుడు ఆనాడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోడీగారు ఇచ్చిన హోదా హామీని నిల‌బెట్టుకోవాల్సిందే నంటూ పెద్ద పోరుకు తెర‌లేపారు. అంతేకాదు, హోదా ఇవ్వ‌కుండా రెండు పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారంటూ ప్యాకేజీపై ఫైరైపోయారు. కేంద్రంపై ఈవిష‌యంలో పోరాడేందుకు ఎంపీలంద‌రూ సిద్ధం అవ్వాల‌ని, రాజీనామా చేయాల‌ని కాకినాడ స‌భా వేదిక‌గా పిలుపు కూడా ఇచ్చారు. త‌న ఉద్య‌మానికి కొన్ని ద‌శ‌లు ఉంటాయ‌ని కూడా ఆయ‌న టైం చెప్పేశారు.

 ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లే అటు టీడీపీకి, ఇటు బీజేపీకి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఎంత మంది ఆందోళ‌న చేసినా.. త‌మ‌కు లెక్క‌లేద‌ని, కానీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆందోళ‌న‌కే తాము ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎలాంటిఉద్య‌మాల‌కూ తెర‌దీయ‌కుండా.. బుజ్జ‌గించేందుకు టీడీపీ కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రిని, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును రంగంలోకి దింపుతున్నాయి. వీరిద్ద‌రూ ప‌వ‌న్‌ను ప్రైవేటుగా కూర్చోబెట్టి.. ప్యాకేజీపై క్లాస్ ఇస్తార‌ట‌! ప్యాకేజీనే మంచిద‌ని ప‌వ‌న్‌తోనే చెప్పించేందుకు ఇద్ద‌రూ సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌! మ‌రి హోదా విష‌యంలో ఇప్ప‌టికే త‌న స్టాండ్ ఏమిటో చెప్పిన ప‌వ‌న్‌.. వీరిద్ద‌రికీ ప‌డిపోతారా? అన్న‌ది చూడాలి. మ‌రి వీళ్లిద్ద‌రూ ఏం మాయ చేస్తారో.. ప‌వ‌న్‌ని ఎలా దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి.  అయితే హోదాపై పోరాటానికి రెడీ అంటోన్న ప‌వ‌న్‌కు ఈ క్లాస్ ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తుంది అన్న‌ది కూడా సందేహ‌మే.