ఏపీ బీజేపీ నేత‌ల నోటికి తాళం వెన‌క‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్ర‌బాబుల‌పై ప‌రోక్షంగా విరుచుకుప‌డిన ఏపీ బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని చెపుతోంది అంటూ వ్యాఖ్య‌లు కుమ్మ‌రించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంత‌లా ఏపీ క‌మ‌ల ద‌ళం బిగుసుకు పోవ‌డానికి కార‌ణ‌మేమై ఉంటుంది? ఎందుకు అంద‌రూ ఇంత‌లా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే న‌డించింద‌ని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ప్లే అయిన ఈ స్టోరీలో ఏపీ బీజేపీ నేత‌లు క్యారెక్ట‌ర్లుగా మారిపోయి చెప్పింది చేస్తున్నార‌ట‌! మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కమ‌లం పార్టీ ఆ ఎన్నిక‌ల్లో ఓ నాలుగు అసెంబ్లీ.. రెండు లోక్‌స‌భ స్థానాలను కైవ‌సం చేసుకుంది. ఆ త‌ర్వాత రాష్ట్రంలో రెండు మంత్రి ప‌ద‌వులు సైతం చేజిక్కించుకుంది. అయితే, తాము మిత్ర‌ప‌క్షంగా ఉన్నామ‌న్న విష‌యం మ‌రిచిపోయి.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టీడీపీని ఏకేయ‌డం మొద‌లు పెట్టారు స్టేట్ బీజేపీలోని కొంద‌రు నేత‌లు. బీజేపీని బ‌లోపేతం చేయ‌డం వ‌ర‌కు ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ, మిత్ర‌ప‌క్షంమీద రాళ్లేసి.. తాము ఎదుగుదామ‌ని పెద్ద స్కెచ్ గీశారు. కేంద్రం ఇస్తున్న నిధుల‌ను  సీఎం చంద్ర‌బాబు వాడేసుకుంటూ కూడా ఏమీ ఇవ్వ‌లేద‌ని కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చెబుతూ మొద‌లైన ఈ ఆరోప‌ణ‌లు బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు పురందేశ్వ‌రి లెక్క‌లు అప్ప‌జెప్పాల‌నే వ‌ర‌కు వ‌చ్చింది.

ఇక‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం మ‌డ‌మ తిప్పి.. ప్యాకేజీకే డిసైడ్ అయిన త‌ర్వాత స్టేట్ బీజేపీ నేత‌లు మ‌రింత కంగుతిన్నారు. చంద్ర‌బాబు ఈ త‌ప్పునంతా బీజేపీ మీద‌కి ఎక్క‌డ‌నెడ‌తారో అని తీవ్రంగా భ‌య‌ప‌డిపోయారు. దీంతో హోదా క‌న్నా ప్యాకేజీయే మేలు అనే టాపిక్‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ల‌డంతోపాటు, టీడీపీపై దాడిని పెంచాల‌ని ప్లాన్ చేశారు. ఈక్ర‌మంలోనే దాదాపు తెగిపోతుందా? అనే వ‌ర‌కు బీజేపీ, టీడీపీ బంధం హ‌ద్దులు దాటింది. క‌రెక్ట్‌గా ఈ స‌మ‌యంలోనే జొక్యం చేసుకున్న బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం.. స్టేట్ నేత‌ల‌కు త‌లంటేసింది!! టీడీపీ అవ‌స‌రం బీజేపీకి ఎంత ఉందో లెక్క‌లేసి మ‌రీ చెప్పేసింది.

‘మీరు మీ సొంత ఎజెండాలు పక్కన పెట్టండి… 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనం కలిసి పోటీ చేశాం.. ఇద్దరం అధికారంలోకి వచ్చాం.. మనది జాతీయ పార్టీ.. మనం తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళతాం.. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయడమా? లేదా? అన్నది తెలుగుదేశం పార్టీ ఇష్టం.. మనం అయితే కలిసి పోటీ చేద్దామనుకుంటున్నాం.. మీరు అందుకు అనుగుణంగా పనిచేయాలి.. వ్యక్తిగత విమర్శలు చేయవద్దు.. విధానపరమైన విమర్శలు చేయండి.. చంద్రబాబు జాతీయస్థాయిలో క్రెడిబులిటీ ఉన్న నాయకుడు.. మనం దాన్ని మర్చిపోకూడదు. ప్యాకేజీపై అవసరమైతే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రచారం చేయండి.. ప్రత్యేకహోదా కంటే మించిన ప్యాకేజీ ఇచ్చామని ప్రజలకు వివరించండి.. అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని క‌మల ద‌ళాధిప‌తి అమిత్ షా క్లాస్ ఇచ్చేస‌రికి స్టేట్ బీజేపీ నేత‌లు లైన్‌లోకి వ‌చ్చేశారు. టీడీపీ మీద కామెంట్ల‌కు కామాయే కాదు.. ఫుల్‌స్టాప్ కూడా పెట్టేశారు! ఇదీ క‌థ‌!!