ముర‌ళీమోహ‌న్ వార‌సురాలు వ‌స్తోంది!

ప్ర‌స్తుతం ఇరు రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి! 2019 ఎన్నిక‌ల్లో త‌మ కొడుకులు, కూతుళ్ల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్ప‌టినుంచే సీనియ‌ర్ నాయ‌కులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ త‌రుణంలో త‌న‌ కోడ‌లిని రాజ‌కీయ వార‌సులిగా తీసుకొస్తున్నారు రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌!! భ‌విష్య‌త్తులో రాజ‌మండ్రి ఎంపీగా ఆమెతో పోటీచేయించేందుకు ఇప్ప‌టినుంచే ఆమెను సిద్ధం చేస్తున్నారు!

తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో రాజ‌మండ్రి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమ‌ర్..కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. అయితే 2009 ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ముర‌ళీమోహ‌న్ పోటీచేశారు. అయితే పార్ల‌మెంటు ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాల వ‌ల్ల విజ‌యానికి చేరువ‌లో నిలిచిపోయారు. తొలి నుంచీ ఆధిక్యం కొన‌సాగించినా.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ముర‌ళీమోహ‌న్ 2014లో కేవ‌లం 2 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అయితే 2014లో కాంగ్రెస్‌పై ప్ర‌జ‌లు ఆగ్రహంతో ఉండ‌టం, టీడీపీ-బీజేపీ కూట‌మికి ప్రజ‌లు జై కొట్ట‌డంతో 1.57ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు. అప్ప‌టినుంచి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో తన వార‌సురాలిగా కోడ‌లు రూపాదేవిని తీసుకురాబోతున్నార‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ట‌. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు అంత అనుకూలంగా లేక‌పోవ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అందుకే ఏ రాజ‌కీయ కార్య‌క్ర‌మ‌మైనా , ఫంక్ష‌న్లు జ‌రిగినా త‌న వెంట ఆమెను తీసుకెళుతున్నారు. అంద‌రికీ ప‌రిచ‌యం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌లు కూడా ఆమెతోనే మాట్లాడాల‌ని పార్టీ నాయ‌కుల‌కు చెబుతున్నార‌ట‌. ఇక ఆయ‌న‌కు వ‌య‌స్సు కూడా పైబ‌డ‌డంతో త‌న కోడలు రూపాదేవిని ఎంపీగా పోటీచేయించి.. తాను రాజ‌కీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.