పొత్తుల కోసం జ‌గ‌న్ త‌హ‌త‌హ

ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా రెండున్న‌రేళ్లు ఉంది. అయితే ఇప్ప‌టి నుంచే 2019 ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌.. సొంతంగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. దీంతో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి! ముఖ్యంగా వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా `సీఎం` పీఠాన్ని ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. సొంతంగా పోటీచేసేకంటే ఎవ‌రో ఒక‌రిని క‌లుపుకుని వెళితే సీఎం అయిపోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. అందుకే అటు జ‌న‌సేన‌, ఇటు వామ‌ప‌క్షాల‌తో పొత్తు కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.

విభ‌జ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌కు తొలి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలుచేశారు. ఇక గెలుపు త‌న‌దేన‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. స‌డ‌న్‌గా `జ‌న‌సేన`తో ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డం.. టీడీపీకి మ‌ద్ద‌తివ్వ‌డం.. సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి! దీంతో జ‌గ‌న్‌కు సీఎం క‌ల.. క‌ల‌గానే మిగిలిపోయింది. 2104లో నెర‌వేర‌ని క‌ల‌ని 2019లోనైనా తీర్చుకోవాల‌ని చూస్తున్నాడు జ‌గ‌న్‌! ప్రస్తుతం రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన బీజేపీ.. తెస్తామ‌ని ప్ర‌క‌టించిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్‌చేసుకోవాల‌ని జ‌గ‌న్ చూస్తున్నాడు.

ప‌వ‌న్ రాక‌తో ఏపీలో కొత్త పొత్తులు పొడిచే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. దీనికి ఊతమిచ్చేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో మినహా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని వైసీపీ నేత కన్నబాబు ప్రకటించారు. దీంతో అటు బీజేపీకి, ఇటు పవన్ కు దారులు తెరిచే ఉంచామని సంకేతాలిచ్చారు. బీజేపీతో పొత్తు కోసం జ‌గ‌న్ ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక బీజేపీ కాదంటే.. కమ్యూనిస్టులైనా ఓకే..అని జగన్ ముందుగానే తన సంసిద్ధతను ప్రకటించారని విశ్లేషిస్తున్నారు.

హోదా ఇవ్వ‌నందుకు కేంద్రంపై ప‌వ‌న్ గుర్రుగా ఉన్నాడు. అలాగే కమ్యూనిస్టులంటే సానుభూతి కూడా ప్ర‌క‌టించాడు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ను త‌న అక్కున చేర్చుకుంటే.. ఇక భవిష్య‌త్తు(2019)లో ఢోకా ఉండ‌ద‌ని జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట‌. అయితే జ‌గ‌న్‌తో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోవ‌డం జ‌రిగేప‌ని కాద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా వైకాపా పొత్తు కోకిల చాలా ముందే కూసేసింది. మ‌రి ఈసారైనా జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేరుతుంతో లేదో!!


Leave a Reply

*